Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎర్ర సముద్రంలో ఏం జరిగింది? భారత వాణిజ్య నౌకపై దాడి, ఇది ఎవరి పని?

ఎర్ర సముద్రంలో ఏం జరిగింది? భారత వాణిజ్య నౌకపై దాడి, ఇది ఎవరి పని?

Big TV Live 2 weeks ago

Red Sea: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న వేళ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకపై దాడి జరగడం కలకలం రేపింది.

నౌకలో ఉన్న 14 మంది భారత సిబ్బందిని యెమెన్‌ కోస్ట్‌గార్డ్‌ రక్షించింది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు? అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.

ఎర్ర సముద్రంలో ఏం జరిగింది?

భారత నౌకపై ఎర్ర సముద్రంలో దాడి జరిగింది. మంగళవారం యెమెన్‌ జలాల సమీపంలో ఎంఎస్‌వీ ఫైజ్‌ నూర్‌ ఒలియా నౌకపై గుర్తు తెలియని వస్తువు తగలడంతో బోల్తా పడింది. ఘటన సమయంలో నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. సమీపంలోని యెమెన్‌ తీర ప్రాంత రక్షక దళం రంగంలోకి దిగింది. నౌకలో ఉన్న భారతీయ సిబ్బంది సహా యెమెన్‌కి చెందిన ఓ వ్యక్తిని కాపాడింది. వెంటనే వారికి వైద్య సేవలు అందజేసింది. ఘటన తర్వాత అందులో చిక్కుకున్న భారత సిబ్బందిని మొఖా పోర్టుకు తరలించింది. హౌతీల ఆధీనంలో ఉన్న హోడెడా ఓడరేవుకు దక్షిణంగా సుమారు 13 నాటికల్ మైళ్ల దూరంలో ఎంఎస్‌వి ఫైజ్ నూరే ఒలియా నౌకపై దాడి జరిగింది.

భారత వాణిజ్య నౌకపై దాడి

ఈ ఘటనను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ వెల్లడించారు. నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమైన విషయమన్నారు. భారతీయ నావికుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, సిబ్బందికి సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

భారత విదేశాంగ శాఖ రియాక్ట్

ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. జరిగిన దాడిని ఖండిస్తూ రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. సిబ్బంది భద్రత రక్షణ కోసం యెమెన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారు అనేదానిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన ఆందోళనకు దారి తీసింది.

భారత నౌకలపై దాడులు తీవ్ర ఆందోళనకరమైనవి భారత్ పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపాలని కోరింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడుల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత, నౌకా వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఒక ప్రకటనలో తెలిపింది.

భారత ఐటీ ఉద్యోగులకు ట్రంప్ బిగ్ షాక్.. వీసా పొడిగింపు పైనా ‘బాదుడే బాదుడు’!

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి ఎర్ర సముద్రం. దీని ద్వారా సుయాజ్‌ కాలువకు కనెక్ట్ అవుతుంది. ఇది యూరప్‌-ఆసియాలను కలిపే మార్గం. ఇటీవల భద్రతా సమస్యలు క్రమంగా పెరిగాయి. యెమెన్‌ సమీపంలోని బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధి ప్రాంతంలో క్రమంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పరిస్థితి గమనించిన పలు అంతర్జాతీయ షిప్పింగ్‌ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live