Hisense A10 and A10 Ultra: ఈ-ఇంక్ ఫోన్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని హైసెన్స్ కొత్త A10, A10 Ultra మోడళ్లను చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా ఈ ఫోన్లలో E-Ink డిస్‌ప్లేతో పాటు అవసరమైనప్పుడు ఉపయోగించుకునే ప్రత్యేక కలర్ స్క్రీన్ కూడా ఉంది. ఇప్పుడీ మోడల్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి..
6.13 అంగుళాల E-Ink డిస్‌ప్లే:
హైసెన్స్ A10 సిరీస్‌లో 6.13 అంగుళాల కార్టా 1300 ఈ-ఇంక్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1648 x 824 పిక్సెల్స్ రిజల్యూషన్, 300 PPI డెన్సిటీతో వస్తుంది. ఇందులో 256 గ్రేస్కేల్ స్థాయిలు, 36 స్థాయిల వార్మ్, కూల్ ఫ్రంట్ లైటింగ్ ఉన్నాయి.
వెనుక భాగంలో కలర్ స్క్రీన్:
ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకునే ఫీచర్ 4.96 అంగుళాల కలర్ స్క్రీన్. ఇది మాగ్నెటిక్ రింగ్, మెటల్ కాంటాక్ట్స్ ద్వారా ఫోన్ వెనుక భాగానికి అమర్చుకోవచ్చు. కలర్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు ఫొటోలు, కామిక్స్, వీడియోలు, సోషల్ మీడియా వంటి కంటెంట్‌ను సులభంగా చూడొచ్చు.
5Gతో మంచి హార్డ్‌వేర్:
A10 సిరీస్‌లో క్వాల్కమ్ QCM6690 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4nm ప్రాసెస్‌పై తయారైంది. అవసరాన్ని బట్టి ప్రాసెసర్ పవర్‌ను తగ్గించడం లేదా పెంచడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని నియంత్రిస్తుంది. 48MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 4,000mAh బ్యాటరీ, 5G, Wi-Fi, బ్లూటూత్ 5.1, USB-C ఉన్నాయి.
గూగుల్ ప్లే స్టోర్ ఉండదు:
ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16తో వస్తాయి. అయితే గూగుల్ ప్లే స్టోర్ ముందుగా ఇన్‌స్టాల్ చేసి ఉండదు. అవసరమైన APKలను సైడ్‌లోడ్ చేసుకోవచ్చు. కిండిల్, లిబ్బీ వంటి యాప్‌లను కూడా ఇలా ఉపయోగించవచ్చు. A10 ధర 8GB+128GB వేరియంట్‌కు సుమారు రూ.45,400 నుంచి, 8GB+256GB వేరియంట్‌కు సుమారు రూ.54,900 వరకు ఉంటుంది. A10 అల్ట్రాతో కలర్ స్క్రీన్ కూడా బాక్స్‌లోనే లభిస్తుంది.

