Salman Angry: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) సాధారణంగా అభిమానులతో, మీడియాతో చాలా సరదాగా ఉంటారు. కానీ, కొన్నిసార్లు పరిధులు దాటినప్పుడు ఆయనకు కోపం రావడం కూడా సహజమే.
తాజాగా ముంబైలోని ఒక ప్రసిద్ధ ఆసుపత్రి వెలుపల సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఆసుపత్రి పరిసరాల్లో ఫోటోగ్రాఫర్లు ప్రవర్తించిన తీరుపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్ పెద్ది..
అసలేం జరిగిందంటే..?
ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకరిని పరామర్శించడానికి సల్మాన్ ఖాన్ వెళ్లారు. సల్మాన్ వాహనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడే కొందరు ఫోటోగ్రాఫర్లు ఆయనను గమనించారు. అక్కడి నుండి ఆసుపత్రి వరకు ఆయన వాహనాన్ని వెంబడించారు. ఇక సల్మాన్ ఆసుపత్రి నుండి బయటకు వస్తున్న సమయంలో, ఫొటోల కోసం ఫోటోగ్రాఫర్లు ఆయన దృష్టిని ఆకర్షించడానికి “భాయ్.. భాయ్” అంటూ గట్టిగా అరవడం ప్రారంభించారు. ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రదేశంలో, రోగులకు ఇబ్బంది కలిగేలా మీడియా ప్రతినిధులు అలా ప్రవర్తించడంతో సల్మాన్ ఖాన్‌కు తీవ్ర కోపం వచ్చింది.
‘మీకేమైనా పిచ్చెక్కిందా?’ అంటూ..
నిరాశ, ఆగ్రహానికి గురైన సల్మాన్ ఖాన్ వెంటనే వాహనం ఎక్కకుండా వెనక్కి తిరిగి ఫోటోగ్రాఫర్ల వైపు నడుచుకుంటూ వచ్చారు. నేరుగా వారి వద్దకు వచ్చి.. “మీకేమైనా పిచ్చెక్కిందా? (పాగల్ హో గయే హో?)” అంటూ మండిపడ్డారు. ఆసుపత్రి పరిసరాల్లో నిశ్శబ్దంగా ఉండాలని, పద్ధతిగా ప్రవర్తించాలని గట్టిగా హెచ్చరించారు. “ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇలా ఆసుపత్రిలో చేరితే మీరు ఇలాగే కేకలు వేస్తూ ప్రవర్తిస్తారా?” అని ఆయన వారిని ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్ అంతగా ఆగ్రహించడంతో, అక్కడున్న ఫోటోగ్రాఫర్లు క్షణాల్లో సైలెంట్ అయిపోయి, వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పారు.

