Tirupati: కన్నకూతురిలా చూసుకోవాల్సిన పిన్ని మొగుడే కామాంధుడయ్యాడు. వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని వచ్చిన ఆ 16 ఏళ్ల బాలికపై వరసకు బాబాయ్ అయ్యే వ్యక్తి కన్నువేశాడు.
నమ్మకమే ఆసరాగా చేసుకుని, బెదిరింపులకు దిగి పదే పదే లైంగిక దాడికి పాల్పడిన ఘాతుకం తిరుపతిలో వెలుగుచూసింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుపతిలోని తన పిన్ని ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ ఆ బాలికపై ఆమె బాబాయ్ కన్ను పడింది. బాలికకు తెలియకుండా కొన్ని ఫోటోలు తీసిన అతడు, వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ భయపెట్టడం ప్రారంభించాడు. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని, లొంగదీసుకుని పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
భయంతో నలిగిపోయిన ఆ బాలిక, సెలవులు ముగిసి హైదరాబాద్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాక తల్లికి అసలు విషయం చెప్పి కన్నీరు పెట్టుకుంది. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోయిన తల్లి, వెంటనే హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఘటన తిరుపతిలో జరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ‘జీరో ఎఫ్‌ఐఆర్’ (Zero FIR) నమోదు చేశారు. అనంతరం తదుపరి దర్యాప్తు కోసం కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుడుపై కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు.

