Dailyhunt
Garuda Purana Part 04: ఆత్మ చేరుకునే నాలుగో పట్టణం గంధర్వపురం - ఆత్మను వేధించే మానసిక వేదన, తీవ్రమైన ఆకలి

Garuda Purana Part 04: ఆత్మ చేరుకునే నాలుగో పట్టణం గంధర్వపురం - ఆత్మను వేధించే మానసిక వేదన, తీవ్రమైన ఆకలి

Big TV Live 5 days ago

Garuda Purana Part 04: గరుడ పురాణం ప్రకారం ఆత్మ యమలోకానికి చేసే ప్రయాణంలో గంధర్వపురం అనేది నాలుగవ పట్టణం. వైతరిణి నదిని దాటిన తర్వాత, తన పాపపు మూటను మోస్తూ ఆత్మ ఈ నగరానికి చేరుకుంటుంది.

గంధర్వపురం ఎలా చేరుకుంటుంది: ఆత్మ తన ప్రయాణంలో మూడవ పట్టణమైన ‘సౌరిపురం’ దాటిన తర్వాత, ఒక నెల కాలం పాటు నడుస్తూ గంధర్వపురం చేరుకుంటుంది. ఈ మార్గం అంతా ముళ్ళతో, రాళ్లతో నిండి ఉంటుంది. మరణించిన తర్వాత నాలుగవ నెలలో ఆత్మ ఈ నగరానికి చేరుకుంటుంది. అప్పటికే ఆకలి దప్పులతో అలమటిస్తున్న ఆత్మ, యమదూతల హింస భరించలేక దీనంగా విలపిస్తూ ఇక్కడికి వస్తుందట.

అక్కడ అనుభవించే శిక్షలు మరియు బాధలు: గంధర్వపురంలో ఆత్మ పడే బాధలు అత్యంత భయంకరంగా ఉంటాయని గరుడపురాణంలో ఉందని పండితులు చెప్తున్నారు. యమదూతలు ఆత్మను పాశాలతో కట్టి, గదల వంటి ఆయుధాలతో కొడుతూ నడిపిస్తారట. “నువ్వు బతికున్నప్పుడు పుణ్యకార్యాలు ఎందుకు చేయలేదు?” అంటూ గద్దిస్తూ హింసిస్తారట. ఈ ప్రయాణంలో ఆత్మ తన ఇంటిని, భార్యాపిల్లలను, సంపాదించిన ఆస్తిని తలచుకుని భోరున ఏడుస్తుందట. అక్కడ ఉండే ఇతరుల రోదనలు విని ఆత్మ మరింత భయభ్రాంతులకు గురవుతుందట. ఆ సమయంలో ఆత్మకు విపరీతమైన ఆకలి వేస్తుందట. కానీ అక్కడ తినడానికి ఏమీ ఉండదట. కేవలం ఆ నాలుగవ నెలలో బంధువులు పెట్టే ‘మాసిక శ్రాద్ధం’ (పిండం) మాత్రమే ఆత్మకు ఏకైక ఆహారమట. గంధర్వపురంలో ఆత్మ తాను చేసిన ప్రతి అబద్ధాన్ని, ప్రతి అన్యాయాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతుందట.

గంధర్వపుర విశేషాలు: ఈ నగరానికి గంధర్వులు అధిపతులుగా ఉంటారట. వారు ఆత్మను పరీక్షకు గురిచేస్తారట. ఆత్మ గంధర్వపురంలో ఉన్నప్పుడు బంధువులు ఇచ్చే నాలుగవ మాసిక పిండం ఆత్మకు బలాన్నిస్తుందట. ఒకవేళ బంధువులు ఈ కర్మలు చేయకపోతే, ఆత్మ ఆకలితో అలమటిస్తూ, ఆ దప్పిక తీరక మరింత నరకయాతన అనుభవిస్తుందట. ఈ పట్టణంలో కొంతకాలం గడిపిన తర్వాత, ఆత్మ తన తదుపరి పట్టణమైన ‘శైలాగమం’ వైపు ప్రయాణించాల్సి ఉంటుందట.

వైతరిణి నది దాటిన తర్వాత వచ్చే ఈ గంధర్వపురం, ఆత్మకు తన పాపాల తీవ్రతను మొదటిసారిగా పూర్తిస్థాయిలో రుచి చూపిస్తుందట. అందుకే మన సంప్రదాయంలో మరణానంతరం చేసే మాసిక కర్మలకు అంత ప్రాధాన్యత ఉందని పండితులు చెప్తుంటారు.

NOTE:ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో ఐదవ పట్టణమైన శైలాగమానికి ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు రేపటి కథనంలో తెలుసుకుందాం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మూడో పట్టణం నగేంద్రభవనం చేరుకున్న ఆత్మ - పెళ్లాం పిల్లలు గుర్తొచ్చి రోదిస్తుందట

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live