మనోడే కదా.. పిలిచినా ఒక్కటే పిలవకున్నా ఒక్కటే.. అనుకున్నారేమో! పిలవకపోతే అడిగేదెవ్వరు..? అనుకున్నారేమో! లైట్ తీసుకుందాం.. మనోళ్లే కదా! అని కూడా అనుకొని ఉంటారు.
మొత్తానికి కోదండరామ్ పార్టీని సర్కార్.. ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్ కింద చూసింది. మన ఇంట్లో వండిన కోడి కూరైనా అది పప్పుచారుతో సమానమే.. అంత ఇంట్రస్టు ఉండదన్నమాట! అదీ ఆ సామెతకు అర్థం. ఇప్పుడు మిత్రపక్షమైన తెలంగాణ జన సమితి విషయంలో కూడా ఇదే విధానం పాటించింది రేవంత్ సర్కార్.
సెక్రటేరియట్‌లో ఈనెల 4న ఉదయం 11 గంటలకు ఓ మీటింగు పెట్టుకుంటున్నది సర్కార్. ఉద్యమకారులను గుర్తించి వారికి పింఛన్, స్థలం కేటాయింపు… ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు. దీని కోసం వేసిన కేకే కమిటీ అక్కడ ఆ రోజు భేటీ కానుంది. వీరితో చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది సర్కార్. చిన్నా చితక పార్టీలు మొదలు.. ప్రధాన పార్టీల వరకు అన్నీ ఉన్నాయి వారు పంపిన ఆహ్వాన జీవో ప్రతిలో. కానీ అందులో తెలంగాణ జన సమితి పార్టీ పేరు మాత్రం మిస్ అయ్యింది.
మిస్ అయ్యిందా? కావాలనే మిస్ చేశారా? లేకపోతే కేకే కమిటీలో మెంబర్‌గా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామే ఉన్నాడు.. ఇక ఆ పార్టీ నేతలు ఈ మీటింగుకు అవసరమా? అని సరిపెట్టుకున్నారా? ఇదంతా కాదు.. అసలు తెలంగాణ జన సమితి అనే పార్టీ ఒకటి ఉంది..! అనే కనీస స్పృహ అయినా సర్కార్‌కు ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు టీజేఎస్‌కు చెందిన కొంత మంది నేతలు. ఎందుకంటే.. ఆ పార్టీని సర్కార్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికలకు ముందు మిత్రపక్షంగా కలుపుకున్నారు.
గెలిచిన తరువాత పదవులిస్తామన్నారు. కానీ ఆ తరువాత అటు ఛాయలకు కూడా పోలేదు. టీజేఎస్ నేతలు సీఎంతో కలిసి ఫోటోలు దిగి రావడం తప్పితే ఇప్పటి వరకు పదవుల ఊసు లేదు. ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ వీరిని మాత్రం అటు పీసీసీ చీఫ్ పట్టించుకోవడం లేదు.. సీఎం ఎలాగోలా కోదండరామ్‌ను ఎమ్మెల్సీని చేసేసి హమ్మయ్యా ..! అని చేతులెత్తేశారు. ఇప్పుడు ఏకంగా తమను పార్టీగా కూడా గుర్తించడం లేదా ఏందీ? అనే కొత్త అనుమానానికి తెర తీసేలా సర్కార్.. అందరినీ ఆహ్వానించి..వీరిని మాత్రం విస్మరించడం పట్ల.. అలక వహించారట ఆ పార్టీ నేతలు. మరి ఈ విషయం కోదండరామ్‌కు తెలిసిందా? తెలిసినా ఆయన కూడా ఏం చేయగలడు..? వీరినే బుజ్జగించడం తప్ప! అని పెదవి విరుస్తున్నారట టీజేఎస్ నేతలు.

