Viral video in New York: అమెరికా అంటే భూతల స్వర్గం..అందరూ చెప్పే మాటే.కానీ ఈ వీడియో చూస్తే ఆ మాటని వెనక్కి తీసుకోవడం పక్కా.ఎందుకంటారా ..ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసిన వర్షాలు న్యూయార్క్ సిటీని సముద్రంలా మార్చేశాయ్ మరి.అవును ..ఎటు చూసినా సముద్రాన్ని గుర్తుకుతెచ్చేలా మారిన రోడ్లు,మునిగిన వాహనాలు, స్తంభించిన జనజీవనంతో న్యూయార్క్ నగరం విలవిల్లాడిపోతోంది.
వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే
ముఖ్యంగా క్వీన్స్, బ్రూక్లిన్ వంటి అత్యంత రద్దీగా ఉండే జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఆకస్మిక వరదల దాటికి పూర్తిగా మునిగిపోయాయి. నగరంలోని లైఫ్ లైన్ లాంటి సబ్‌వే రైలు సర్వీసులు కూడా వరద నీటితో నిండిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయి భూమ్మీదే నరకాన్ని చూస్తున్నారు. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో కేవలం గంట వ్యవధిలోనే దాదాపు 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఊహించని దారుణ సంఘటన
ఈ వర్షం సృష్టించిన భీభత్సానికి అద్దం పట్టేలా నగర వీధుల్లో జరిగిన ఒక ఊహించని దారుణ సంఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన కేవలం 15 సెకన్ల నిడివి గల ఈ క్లిప్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడవడం ఖాయం. రోడ్డుపై నదిని తలపించేలా ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో, ఓ సిటీ బస్సు డ్రైవర్ వాహనాన్ని సురక్షితంగా ఫుట్‌పాత్ పక్కకు ఆపలేకపోయాడు. నిస్సహాయ స్థితిలో రోడ్డు మధ్యలోనే బస్సును నిలిపివేయడంతో, ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో నేరుగా ఆ మోకాళ్ళ లోతు వరద నీటిలోనే దిగాల్సి వచ్చింది.
also read :ట్రోలర్స్‌కు గట్టి షాక్ ఇచ్చిన విష్ణుప్రియ.. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!
ప్రాణం కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్
ఆ సమయంలో పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఓ మహిళ బస్సు దిగి, నెమ్మదిగా అడుగులు వేస్తూ ఫుట్‌పాత్ వైపు చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, రోడ్డుపై ప్రవహిస్తున్న నీటి వేగం, ఉధృతి ఊహించని విధంగా బలంగా ఉండటంతో ఆమె ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోయింది. పక్కనే ఉన్న కాంక్రీట్ అంచును బలంగా ఢీకొట్టి, చూస్తుండగానే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు, స్థానికులు ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించేందుకు పరుగెత్తుకెళ్లినప్పటికీ.. ప్రవాహ వేగం ఎక్కువ అవడంతో ఆమెను కాపాడలేకపోయారు. కంటిముందే ఒక ప్రాణం కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారీ విపత్తును తట్టుకోలేక
ఈ భయానక వీడియోపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ కనీస అవగాహన లేకుండా, అంతటి ప్రమాదకరమైన నీటి ప్రవాహంలో బస్సును రోడ్డు మధ్యలో ఆపడం వల్లే ఈ ఘోరం జరిగిందని కొందరు మండిపడుతుండగా.. సదరు మహిళ క్షేమంగా, సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ లక్షలాది మంది ప్రార్థిస్తున్నారు. న్యూయార్క్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఈ అకాల వర్షాలపై నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. శతాబ్దాల కాలం నాటి నగర మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ ఇంతటి భారీ విపత్తును తట్టుకోలేక పూర్తిగా స్తంభించిపోయిందని ఆయన అంగీకరించారు.
అత్యవసర రెస్క్యూ ఆపరేషన్లు
సాధారణంగా ఈ వ్యవస్థ గంటకు గరిష్టంగా రెండు అంగుళాల వర్షాన్ని మాత్రమే తట్టుకునేలా డిజైన్ చేయబడిందని, కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా అత్యంత తక్కువ సమయంలోనే మేఘం బద్దలైనట్లు ఊహకందని స్థాయిలో వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులుగా మారాయని వివరించారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా అత్యవసర రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదలు, నీటి నిల్వల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు నగర అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని, అత్యవసర సహాయం లేదా ప్రాణాపాయ స్థితిలో ఉంటే రెస్క్యూ సేవల కోసం వెంటనే ‘311’ నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు నగర ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.చూడాలి ఈ వీడియో తోనైనా ప్రజలు ,ప్రభుత్వం మరింత అలర్ట్ అవుతుందో లేదో !
also read :'ఆదర్శ కుటుంబం' క్రేజీ లీక్….త్రివిక్రమ్ సెంటిమెంట్ రిపీట్!

