Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హామీలు ఏమాయె? రేవంత్ రెడ్డిపై తలసాని ఘాటు విమర్శలు!

హామీలు ఏమాయె? రేవంత్ రెడ్డిపై తలసాని ఘాటు విమర్శలు!

Big TV Live 1 week ago

Talasani Srinivas: స్వేచ్ఛ బ్యూరో: నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న హామీ ఏమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఏం చేశారో చెప్పకుండా కేసీఆర్ ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ భవన్ లో ఆదివారం ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది..?

తొమిదిన్నర సంవత్సరాల పాలనలో కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందన్నారు. చెరువులలో పూడిక తొలగింపు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిందని వివరించారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించినట్లు తెలిపారు. కానీ రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

హామీలు ప్రశ్నిస్తే తప్పుడు ప్రచారమా..?

మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే తమ పై తప్పుడు ప్రచారం చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

రేవంత్ రెడ్డికి ఒక్కరోజు కూడా కేసీఆర్ ను తిట్టకుంటే నిద్రపట్టదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలన్నారు. 18ఏళ్లు నిండిన ఓటరుగా నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రజలు కూడా సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, నాయకురాలు మాగంటి సునీత, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live