Skoda Octavia Hybrid and EV Plans: స్కోడా ఆటో పాపులర్ సెడాన్ మోడల్ అయిన స్కోడా ఆక్టేవియా కొత్త వెర్షన్లలో తీసుకురాబోతోంది. హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్లను తీసుకురానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఆక్టేవియా మోడల్ ను మరింత అత్యాధునికంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త పవర్ ట్రెయిన్లతో స్కోడా ఆక్టేవియా
భవిష్యత్తులో ఆక్టేవియా కోసం ప్యూర్ హైబ్రిడ్ తో పాటు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి వస్తాయని స్కోడా టెక్నికల్ డెవలప్‌మెంట్ హెడ్ జోహన్నెస్ నెఫ్ట్ వెల్లడించారు. ప్రస్తుతం స్కోడా తమ కార్లలో ఎలక్ట్రిఫికేషన్‌పై ఎక్కువ దృష్టి పెడుతోంది. అదే సమయంలో ఆక్టేవియాకు కూడా కొత్త టెక్నాలజీని జోడించనుంది. ఈ కొత్త హైబ్రిడ్ సిస్టమ్ లో వోక్స్ వ్యాగన్ గ్రూప్ కు చెందిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను ఉపయోగించనున్నారు. దీనికి ఎలక్ట్రిక్ మోటార్, 1.6kWh బ్యాటరీ ప్యాక్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను యాడ్ చేయనున్నారు.
తక్కువ వేగంతో కారు నడిచేటప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ పని చేస్తుంది. ఎక్కువ పవర్ అవసరమైనప్పుడు పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ సిస్టమ్ ఇప్పటికే వోక్స్ వ్యాగన్ గోల్ఫ్, టీ రాక్ లాంటి మోడళ్లలో ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. అందులో 138 హార్స్ పవర్, 172 హార్స్ పవర్ అవుట్ పుట్ వెర్షన్లు ఉంటాయని తెలుస్తోంది. ఇదే సెటప్ ను ఆక్టేవియాలో కూడా అందించే అవకాశం ఉంది.
ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్ గురించి..
ఇక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 19.7kWh బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించనున్నారు. ఇదే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను జత చేయనున్నారు. ఈ సిస్టమ్ ప్రస్తుతం వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ ఇ-హైబ్రిడ్ లో అందుబాటులో ఉంది. ఆ కారులో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్ లో సుమారు 142 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే, ఆక్టేవియా పరిమాణం పెద్దగా ఉండటంతో దాని ఎలక్ట్రిక్ రేంజ్ కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్కోడా కొత్త మార్పులు చేస్తున్నప్పటికీ, డీజిల్ ఇంజిన్లను పూర్తిగా నిలిపివేయడం లేదు. మార్కెట్లో ఇంకా డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉందని భావిస్తున్న కంపెనీ, ఆక్టేవియాలో పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ ను కూడా కొనసాగించనుంది.
అటు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆక్టేవియా మోడల్ పై కూడా స్కోడా పని చేస్తోంది. గత ఏడాది మ్యూనిచ్ మోటార్ షోలో ప్రదర్శించిన విజన్ O కాన్సెప్ట్ ద్వారా డిజైన్ కు సంబంధించిన సంకేతాలను ఇప్పటికే చూపించింది. అయితే, ఆ ఎలక్ట్రిక్ ఆక్టేవియా మార్కెట్లోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Read Also: కాంకోర్డ్ ఫ్లైట్ స్టైల్ లో BMW కొత్త K 18 బైక్.. వారెవ్వా ఏముంది భయ్యా!

