Child Trafficking: స్వేచ్ఛ బ్యూరో: ఆపరేషన్ 'దేవ్' పేర గుజరాత్ పోలీసులు జరిపిన ఆపరేషన్ లో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్ లీడర్ మురుగన్ ను జరిపిన విచారణలో అతనికి హైదరాబాద్ లోని మూడు సంతాన సాఫల్య కేంద్రాలతో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైంది.
ఈ క్రమంలో గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం ఆయా ఫర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు జరిపింది. గత నెల ప్రారంభంలో గుజరాత్ రాష్ట్రం వడ్ గాం ప్రాంతం నుంచి నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనస్కాంత పోలీసులు బాలున్ని రక్షించటానికి ఆపరేషన్ 'దేవ్' పేర స్పెషల్ ఆపరేషన్ జరిపారు.
చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్..
ఈ క్రమంలో కిడ్నాప్ అయిన బాలున్ని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని జరిపిన విచారణలో జరిగిన కిడ్నాప్ వెనక అంతర్ రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఉన్నట్టుగా వెల్లడైంది. దాంతో మరింత లోతుగా విచారణ జరుపగా తెలంగాణకు చెందిన మురుగన్ ముఠా పొత్తిళ్లలోని బిడ్డలను కిడ్నాప్ చేసి లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసులు ఇప్పటికే మురుగన్ తోపాటు తిరుపతి, గంగాధర్ లను అరెస్ట్ కూడా చేశారు. కేసులో కరీంనగర్ కు చెందిన మల్లయ్య, మురుగన్ భార్య కృష్ణవేణి తదితరులను నిందితులుగా చేర్చారు.
ఎవరీ మురుగన్..
పోలీసుల విచారణలో మురుగన్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన వాడని వెల్లడైంది. మొదట్లో ఇటుక బట్టీలో కూలీగా పని చేసిన మురుగన్ ఆ తరువాత హైదరాబాద్ వచ్చి సంతాన సాఫల్య కేంద్రాలకు ఎగ్ డొనార్లను సమకూర్చే బ్రోకర్ గా పని చేసేవాడని తేలింది. సంతానం లేని దంపతులకు సరోగసికి సిద్ధపడ్డ మహిళలను పరిచయం చేసేవాడని స్పష్టమైంది. ఈ పని చేసి పెట్టినందుకు ఒక్కో దంపతుల నుంచి 5వేలు మొదలుకుని 6వేల రూపాయలను కమీషన్ గా తీసుకునే వాడని వెల్లడైంది. అయితే, మరింత డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో మురుగన్ శిశు విక్రయాలను మొదలు పెట్టినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీని కోసం ఏకంగా గ్యాంగును ఏర్పాటు చేసుకున్నట్టుగా తేలింది.
Also read: మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
పుట్టిన కొన్ని గంటల్లోనే…
మురుగన్ ముఠా సభ్యులు వేర్వేరు ఆస్పత్రుల వద్ద తిరుగుతూ ప్రసవం కోసం వచ్చిన నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు, వారి కుటుంబ సభ్యులను డబ్బు ఆశ చూపించి లోబరుచుకునేవారని తెలిసింది. కొన్నిసార్లు డబ్బు ఇచ్చి పొత్తిళ్లలోని బిడ్డలను కొంటే..మరికొన్నిసార్లు అవకాశం చూసుకుని కిడ్నాప్ చేసేవారని తేలింది. ఆ తరువాత పసికందులను ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తీసుకెళ్లి బ్రోకర్ల సహాయంతో మూడు నుంచి అయిదు లక్షల రూపాయలకు అమ్మేవారని వెల్లడైంది. ఇప్పటివరకు ఈ గ్యాంగ్ ఒక్క సంవత్సరంలోనే 25మందికి పైగా శిశువులను ఇలా అమ్మినట్టుగా సమాచారం.
ఫర్టిలిటీ సెంటర్లతో..
ఇక, మురుగన్ ను జరిపిన విచారణలో అతనికి హైదరాబాద్ లోని మూడు ఫర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడి కావటంతో గుజరాత్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం ఇక్కడికి వచ్చింది. మూడు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాల్లో విచారణ జరిపటంతోపాటు తనిఖీలు జరిపింది.
నిజానికి..
నిజానికి గత సంవత్సరం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్ పట్టుబడినపుడే మురుగన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అతను అరెస్ట్ కూడా అయ్యాడు. మూడు నెలలపాటు జైల్లో ఉండి ఆ తరువాత బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు. ఆ తరువాతే వేర్వేరు రాష్ట్రాలకు తన చైల్డ్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ను విస్తరించాడు. ఇక, మురుగన్ భార్య కృష్ణవేణి కూడా మరో చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగును నడుపుతున్నట్టు గుజరాత్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు ఖాయమని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీటెక్ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

