Dailyhunt
హైడ్రా పేదల కోసమేనా? నాదర్గుల్‌లో చెరువుల కబ్జాపై హైడ్రా ఎందుకు నిద్రపోతోంది?: హరీశ్ రావు

హైడ్రా పేదల కోసమేనా? నాదర్గుల్‌లో చెరువుల కబ్జాపై హైడ్రా ఎందుకు నిద్రపోతోంది?: హరీశ్ రావు

Big TV Live 1 week ago

Harish Rao: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నాదర్గుల్ కాసుబాగ్ కంచలోని సుమారు 373 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేస్తోందని.. దీని వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కబ్జాదారులు.. పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ వందలాది మంది రైతులు హరీశ్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ప్రభుత్వ భూములు.. చెరువుల రక్షణ కోసమే హైడ్రాను తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి.. నాదర్గుల్‌లో చెరువులు.. ఫీడర్ ఛానళ్లను ధ్వంసం చేస్తూ కంచెలు వేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా అని ఆయన నిలదీశారు. బడా రియల్ ఎస్టేట్ సంస్థల వైపు కన్నెత్తి చూసే దమ్ము హైడ్రాకు ఉందా అని ధ్వజమెత్తారు. నాదర్గుల్ భూములను అన్యాక్రాంతం కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసిందని.. ఈ భూములు ప్రభుత్వానివే అని ప్రస్తుత సర్కార్ కూడా అఫిడవిట్ వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రైతుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హరీశ్ రావు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.. సీపీ సజ్జనార్.. స్థానిక ఆర్డీవో.. ఎమ్మార్వోలతో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని.. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న రైతులకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను కోరారు. ఆదిభట్ల పోలీసులు రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముకాస్తూ రైతులపైనే దొంగ కేసులు పెడుతున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు. ముదిరాజ్ లకు చెరువులో చేపలు పట్టుకునే హక్కును కల్పించాలని.. గుడిలో పూజలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని అధికారులను ఆదేశించారు.

దాదాపు 70 ఏళ్లుగా శిస్తు చెల్లిస్తూ సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం జరగని పక్షంలో తానే స్వయంగా బీఆర్ఎస్ బృందంతో నాదర్గుల్ భూములను సందర్శిస్తానని హరీశ్ రావు అధికారులకు తేల్చిచెప్పారు. హరీశ్ రావు చొరవతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్.. సీపీ హామీ ఇచ్చారు. నకిలీ పత్రాలతో రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన కంచెలను తొలగించి.. బాధితులకు అండగా ఉంటామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.

Read Also: నీ స్థాయి ఎంత? నీ బతుకెంత?.. కేటీఆర్‌పై మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live