Huawei XPixel Headlights:కార్లలో హెడ్ లైట్లు ఇప్పటి వరకు కేవలం రాత్రి సమయంలో రోడ్డు చక్కగా కనిపించేందుకు ఉపయోగిస్తారని భావించేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ వేగంగా మారుతోంది.
చైనా టెక్ దిగ్గజం హువావే తీసుకొచ్చిన కొత్త Xపిక్సెల్ స్మార్ట్ హెడ్ లైట్లు కార్ల ప్రపంచంలో వండర్ ను క్రియేట్ చేశాయి. ఈ హెడ్ లైట్ల తో కేవలం రోడ్డు మాత్రమే కాదు.. సినిమాలు కూడా చూపించనున్నాయి. అంతేకాదు గేమ్స్, నావిగేషన్ సూచనలు, స్పెషల్ లైట్ ఎఫెక్ట్స్ కూడా చూపించే అవకాశం ఉంది.
బీజింగ్ ఆటో షో కొత్త టెక్నాలజీ ప్రదర్శన
బీజింగ్ ఆటో షోలో హువావే ఈ కొత్త టెక్నాలజీని ప్రదర్శించింది. Xపిక్సెల్ అనే ఈ సిస్టమ్ పూర్తి రంగులతో ప్రొజెక్షన్ చేయగలిగే ప్రత్యేక హెడ్ లైట్ టెక్నాలజీగా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటి వరకు కొన్ని కంపెనీలు రోడ్డుపై గుర్తులు, సూచనలు చూపించే డిజిటల్ హెడ్ లైట్లు తీసుకొచ్చినా, అవి ఎక్కువగా నలుపు, తెలుపు గ్రాఫిక్స్‌కే పరిమితమయ్యాయి. కానీ, హువావే తీసుకొచ్చిన ఈ సిస్టమ్ మాత్రం పూర్తి RGB కలర్ ప్రొజెక్షన్ ను అందిస్తోంది.
ఈ హెడ్ లైట్ల ప్రత్యేకత ఏమిటంటే, కారును ఒక చిన్న డ్రైవ్ ఇన్ థియేటర్ లా మార్చేస్తుంది. గ్యారేజ్ గోడపై, ఖాళీ ప్రదేశంలో దాదాపు 100 అంగుళాల పరిమాణంలో సినిమా ప్రదర్శించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి బయట సినిమా చూడాలనుకునేవారికి ఇది కొత్త అనుభూతిని ఇవ్వనుంది. పిల్లల కోసం ప్రత్యేక లైట్ షోలు, గేమింగ్ గ్రాఫిక్స్ కూడా ప్రదర్శించవచ్చు.
మరింత అత్యాధునిక టెక్నాలజీతో Xపిక్సెల్
హువావే ఇప్పటికే కొన్ని వాహనాల్లో మోనోక్రోమ్ స్మార్ట్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇప్పుడు వచ్చిన కొత్త తరం Xపిక్సెల్ మాత్రం పూర్తి కలర్ సపోర్ట్ తో మరింత అడ్వాన్స్ డ్ గా మారింది. ఈ సిస్టమ్ లో హై రిజల్యూషన్ LED పిక్సెల్స్ ఉంటాయి. ఇవి స్పష్టమైన ప్రొజెక్షన్ ను అందిస్తాయి. కేవలం వినోదం కోసమే కాకుండా డ్రైవింగ్ సమయంలో కూడా ఈ హెడ్ లైట్లు ఉపయోగపడతాయని కంపెనీ వెల్లడించింది. నావిగేషన్ సూచనలను రోడ్డుపైనే ప్రొజెక్ట్ చేయడం, మలుపులు చూపించడం, ఇతర వాహనాలకు హెచ్చరికలు ఇవ్వడం లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వర్షం, పొగమంచు ఉన్నప్పుడు కాంతి రంగును మార్చి విజిబిలిటీని మెరుగుపరిచే సామర్థ్యం కూడా దీనిలో ఉంది.
అడాప్టివ్ డ్రైవింగ్ బీమ్ టెక్నాలజీతో ఈ హెడ్‌లైట్లు ఎదురుగా వచ్చే వాహనాలను ఇబ్బంది పెట్టకుండా కాంతిని నియంత్రిస్తాయి. అలాగే రోడ్డు ఆకారానికి అనుగుణంగా లైటింగ్ కార్పెట్ తరహా ఎఫెక్ట్ ను కూడా క్రియేట్ చేస్తాయి. ఈ టెక్నాలజీని ముందుగా Aito M9 అనే ఎలక్ట్రిక్ SUVలో అందించే అవకాశం ఉందని హువావే వెల్లడించింది. ఈ వాహనం హువావే భాగస్వామ్యంతో తయారవుతోంది. .
ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలు స్మార్ట్ హెడ్ లైట్లపై పని చేస్తున్నప్పటికీ, చైనా కంపెనీలు మాత్రం ఈ రంగంలో వేగంగా ముందుకెళ్తున్నాయి. భవిష్యత్తులో కార్ల హెడ్ లైట్లు కేవలం లైటింగ్ కే కాకుండా ఎంటర్ టైన్ మెంట్, కమ్యూనికేషన్, భద్రతలో కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. Xపిక్సెల్ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో కార్ల రూపాన్ని, వినియోగాన్ని పూర్తిగా మార్చనున్నాయి.
Read Also: టాటా మెగా ప్లాన్.. మూడు కళ్లు చెదిరే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!

