Dailyhunt
జాగ్రత్తగా దాచుకుంటే తరతరాలు తినొచ్చు.. ఎప్పటికీ పాడవని ఆహారాలివే!

జాగ్రత్తగా దాచుకుంటే తరతరాలు తినొచ్చు.. ఎప్పటికీ పాడవని ఆహారాలివే!

Big TV Live 1 week ago

Foods that never expire: సాధారణంగా మనం ఏ వస్తువు కొన్నా ముందుగా చూసేది 'ఎక్స్‌పైరీ డేట్'. పాలు, పెరుగు, కూరగాయలు ఇలా ఏదైనా సరే కొన్ని రోజులకే పాడైపోతాయని మనకు తెలుసు.

కానీ.. ప్రకృతిలో కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో స్టోర్ చేస్తే.. పది ఏళ్లు కాదు, వంద ఏళ్లు కాదు, ఏకంగా వెయ్యి ఏళ్లయినా సరే అవి అస్సలు పాడవవు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి మన వంటగదిలో.. ఉండే ఆ ‘అమరత్వ’ ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఎప్పటికీ పాడవని పదార్థాలు:

మన నిత్య జీవితంలో ఆహారం వృథా కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వస్తువుల మీద డేట్ అయిపోగానే పారేస్తుంటాం. కానీ సైన్స్ ప్రకారం.. కొన్ని పదార్థాలకు అసలు ఎక్స్‌పైరీ డేట్ అనేదే ఉండదు. అవేంటంటే..

1. తేనె:
ఆహార పదార్థాల్లో అన్నిటికంటే టాప్ లిస్టులో ఉండేది తేనె. పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్ట్ పిరమిడ్లలో వేల ఏళ్ల నాటి తేనెను కనుగొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అది ఇప్పటికీ తినడానికి వీలుగా ఉంది. తేనెలో తేమ శాతం చాలా తక్కువగా ఉండటం, దాని ఆమ్ల గుణం బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు. కేవలం గాలి చొరబడని డబ్బాలో పెడితే చాలు.

2. బియ్యం :
మనం రోజూ తినే తెల్ల బియ్యం ముప్పై ఏళ్ల వరకు నిల్వ ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే బ్రౌన్ రైస్ లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది త్వరగా పాడవుతుంది. కానీ వైట్ రైస్‌ను తేమ తగలకుండా స్టోర్ చేస్తే ఏళ్ల తరబడి వాడుకోవచ్చు.

3. ఉప్పు :
ఉప్పు అనేది ఒక ఖనిజం. సముద్రాల నుంచి సేకరించే ఉప్పుకు సహజంగానే బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. అందుకే పచ్చళ్లలో ఉప్పును ప్రిజర్వేటివ్‌గా వాడతారు. ఐయోడైజ్డ్ ఉప్పు ఐదు ఏళ్ల తర్వాత ఐయోడిన్ గుణాన్ని కోల్పోవచ్చు కానీ.. సాధారణ కల్లుప్పు మాత్రం ఎప్పటికీ పాడవదు.

4. చక్కెర :
ఉప్పు లాగే పంచదార కూడా బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. గాలిలోని తేమ తగిలితే చక్కెర గడ్డకడుతుంది కానీ.. దానిలోని గుణాలు మాత్రం మారవు. ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే చక్కెర జీవితకాలం అపరిమితం.

5. ఎండు పప్పు ధాన్యాలు :
కందిపప్పు, పెసరపప్పు లేదా చిక్కుడు గింజలు ఎండబెట్టినవి అయితే దశాబ్దాల పాటు నిల్వ ఉంటాయి. ఇవి పాతబడే కొద్దీ ఉడకడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. కానీ వీటిలో ఉండే పోషక విలువలు మాత్రం అస్సలు తగ్గవు.

ఫ్రిజ్ డోర్ సెల్ఫ్స్‌లో ఏం స్టోర్ చేయాలో తెలుసా ? 99 % మందికి చేసే పొరపాట్లు ఇవే

6. వెనిగర్ :
యాపిల్ సైడర్ వెనిగర్ లేదా వైట్ వెనిగర్ వంటివి ఎప్పటికీ పాడవు. దీనిలోని ఎసిటిక్ యాసిడ్ వల్ల ఇది తనకు తానుగా నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాలక్రమేణా.. దాని రంగు మారవచ్చు కానీ రుచి, ప్రభావం అలాగే ఉంటాయి.

7. నెయ్యి:
మన వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. వెన్నలోని తేమను, పాలను పూర్తిగా మరిగించి తొలగించడం వల్ల నెయ్యి తయారవుతుంది. సరిగ్గా కాచిన నెయ్యిని చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచితే కొన్ని ఏళ్ల పాటు తాజాగా ఉంటుంది.

ఈ ఆహార పదార్థాలు ఎప్పటికీ పాడవకుండా ఉండాలంటే.. ‘నిల్వ చేసే పద్ధతి’చాలా కీలకం. తేమ, సూర్యరశ్మి నేరుగా తగలకుండా చూసుకోవడం, గాలి చేరని డబ్బాలను వాడటం ద్వారా మన కిచెన్ బడ్జెట్‌ను ఆదా చేయడమే కాకుండా.. అత్యవసర సమయాల్లో ఈ ఆహారాన్ని వాడుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live