Jagtial: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని ఒకే కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
జగిత్యాల పట్టణంలో నివాసమంటున్న భారతి, భూషణం దంపతుల పిల్లలు మనవిత్ (10) , మనస్విని (9). ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో వీరు కొండాపూర్‌లోని తమ చిన్నమ్మ ఇంటికి సరదాగా వెళ్లారు. అక్కడ చిన్నమ్మ కొడుకు షర్వింద్ (7) తో కలిసి ఆడుకుంటూ, స్నానం చేయడం కోసం స్థానిక కోనేరు వద్దకు వెళ్లారు.
అయితే, నీటి లోతును అంచనా వేయలేక ముగ్గురు చిన్నారులూ కోనేరులో మునిగిపోయారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికీ జరగరాని నష్టం జరిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు కళ్ల ముందే నిర్జీవంగా మారడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెలవుల్లో సరదాగా గడుపుదామని వచ్చిన పిల్లలు ఇలా అనంత లోకాలను వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

