Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల కోసం ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో సుమారు నాలుగు మీటర్ల లోతున గుంత తవ్వారు.
అయితే పని పూర్తయినా, కాకపోయినా ఆ గుంతను అలాగే వదిలేయడం ఘోర తప్పిదం.
పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న కవిత అనే మహిళ తన ఐదేళ్ల కుమార్తె మోక్షితను వెంటపెట్టుకుని బడికి వచ్చింది. ఆడుకుంటూ వెళ్లిన ఆ చిన్నారి, ప్రమాదవశాత్తు నీటితో నిండి ఉన్న ఆ గుంతలో పడిపోయింది. ఊపిరాడక ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
గత 20 రోజులుగా ఆ గుంత ప్రమాదకరంగా తెరిచే ఉన్నా, అధికారులు పట్టించుకోకపోవడమే ఈ అనర్థానికి కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల లాంటి చోట ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తూ, మృతదేహంతో నిరసనకు దిగారు. కళ్ళముందే ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం.

