Flipkart Pay Later: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీడమ్ సేల్‌కు ముందే Flipkart Pay Later పేరుతో కొత్త క్రెడిట్ సేవలను ప్రారంభించింది.
దీనికోసం ప్రముఖ పేయూ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు తమకు కావలసిన వస్తువులను వెంటనే కొనుగోలు చేసి, ఆ తర్వాత సులభమైన వాయిదాలలో డబ్బులు చెల్లించవచ్చు.
ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు?
ఈ కొత్త Pay Later సేవలు కేవలం ఫ్లిప్‌కార్ట్‌కే పరిమితం కాకుండా.. దానికి సంబంధించిన Myntra, Flipkart Minutes ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. నిత్యం వాడే నిత్యావసర వస్తువుల నుంచి ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్ వరకు ఏవి కొన్నా చెల్లింపుల విషయంలో కస్టమర్లకు ఇది ఎంతో ఊరట కలిగిస్తుంది.
మూడు రకాల చెల్లింపు మార్గాలు:
కొనుగోలు చేసిన వస్తువు విలువను బట్టి కస్టమర్లు 3 రకాల చెల్లింపు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మొదటిది 30 రోజుల్లోగా ఎలాంటి అదనపు రుసుము లేకుండా మొత్తం సొమ్మును చెల్లించడం. రెండోది మొత్తం బిల్లును మూడు సమాన వాయిదాలుగా మార్చుకోవడం. ఇక ఖరీదైన వస్తువుల కోసం 3 నుంచి 12 నెలల కాలపరిమితి కలిగిన EMI సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.
క్రెడిట్ నిర్ణయాలు ఎలా ఉంటాయి?
ఈ కార్యక్రమంలో పేయూ ఫైనాన్స్ లైసెన్స్ కలిగిన రుణదాతగా వ్యవహరిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్ కస్టమర్ల లావాదేవీల చరిత్రను పర్యవేక్షిస్తుంది. వినియోగదారుల కొనుగోలు విధానం, షాపింగ్ అలవాట్లను బట్టి వారికి ఎంత క్రెడిట్ పరిమితి ఇవ్వాలనేది ఇరు సంస్థలు సంయుక్తంగా నిర్ణయిస్తాయి.
ఫుడ్ డెలివరీ రంగానికి విస్తరణ:
షాపింగ్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి దిగ్గజాలు ఏలుతున్న ఈ మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే వారాల్లో దీనికి సంబంధించిన సేవలు దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 8న ప్రారంభమయ్యే ఫ్రీడమ్ సేల్ సమయానికి ఈ పే లేటర్ సదుపాయం రావడం వినియోగదారులకు బాగా కలిసిరానుంది.

