GHMC: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అత్యధిక మంది జనాభాకు పౌర సేవలతో పాటు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో ప్రజాపాలన 99 డేస్ యాక్షన్ ప్లాన్ మొక్కుబడిగా అమలవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద 99 రోజు యాక్షన్ ప్లాన్ ను క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలు సైతం జీహెచ్ఎంసీలో మొక్కుబడిగా అమలవుతున్నాయన్న వాదనలున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రజాపాలనను అమలు చేయటంతో విభిన్నమైన పరిస్థితులు నెలకున్నాయి.
ఈ- వ్యర్థాల సేకరణకే..
ముఖ్యంగా సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజాపాలన 99 డేస్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తూ కమిషనర్లు ఉదయం పర్యటనలు నిర్వహిస్తూనే, మధ్యాహ్నాం సాయంత్రం వేళల్లో వివిధ విభాగాల వారీగా సమీక్షలు కూడా నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కానీ జీహెచ్ఎంసీలో ప్రజాపాలన 99 డేస్ యాక్షన్ ప్లాన్ కేవలం ఈ- వ్యర్థాల సేకరణకే పరిమితమైంది. ఈ కార్యక్రమంలోనూ కనీసం ఉన్నతాధికారులు పాల్గొనకపోవటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ జి.సృజన ప్రతిరోజు ఒక వార్డును ఎంపిక చేసుకుని, డైలీ ఒక వార్డులో పర్యటిస్తుండగా, మల్కాజ్ గిరి కమిషనర్ ర్యాండమ్ గా ప్రాంతాలను ఎంపిక చేసుకుని అన్ని విషయాలు కవర్ అయ్యేలా పర్యటనలు నిర్వహిస్తున్నారు.
నిర్ణీత గడువులోపు..
పర్యటనను కేవలం పౌర సేవల నిర్వహణను తనిఖీ చేయటానికే పరిమితం కాకుండా, వివిధ విభాగాల వారీగా ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వీకరించి, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత కార్యాలయంలో వివిధ విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ హడావుడి చేస్తుంటే, జీహెచ్ఎంసీలో ఒక రకరమైన స్తబ్దత నెలకొంది. ఇటీవల నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కూడా కమిషనర్ హాజరుకావటం లేదు. కానీ సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రతి సోమవారం కమిషనర్లే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా ఆర్జీలను స్వీకరించటంతో పాటు తదుపరి ప్రజావాణి వచ్చే లోపు ఏ ఒక్క ఆర్జీ కూడా పెండింగ్ లో ఉండరాదని డెడ్ లైన్లు విధించారు.
Also read: వామ్మో నరేష్ కొన్న కారు అన్ని కోట్లా ..!
ప్రజాపాలన 99 డేస్ యాక్షన్ ప్లాన్..
అంతేగాక, వివిధ విభాగాల వారీగా వచ్చే ఈ ఆర్జీల్లో పరిష్కరించలేదని ఏదైనా ఉంటే, దానికి అధికారులు లిఖితపూర్వకంగా తనకు నివేదికలను సమర్పించాలని కూడా సైబరాబాద్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో కొంత వరకు అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలపై వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పర్యవేక్షణ జీహెచ్ఎంసీలో ఏ మాత్రం కన్పించటం లేదు. ప్రతి సమస్య పరిష్కారానికి డెడ్ లైన్ విధించటంతో అధికారులు ఉరుకులు, పరుగులు పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ ప్రజాపాలన 99 డేస్ యాక్షన్ ప్లాన్ కాస్త ఆశాజనకంగానే సాగుతుందని తెప్పవచ్చు. సుమారు 70 రోజుల క్రితం మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ మొదలైనప్పటికీ, ప్రారంభమైన కొత్తలో జీహెచ్ఎంసీ కమిషనర్ పాల్గొనగా, గడిచిన 70 రోజుల నుంచి సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్లు డైలీ ఈ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహిస్తూ, అన్ని విభాగాల అధికారులు హాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నారు.
సాంక్షన్ ప్లాన్ అమలవుతుందా? లేదా?
కళ్ల ముందే నాలాలను, రోడ్లను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు కొనసాగుతుంటే కనీసం ప్రశ్నించే పరిస్థితుల్లేని రోజుల్లో మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి తనదైన శైలిలో ప్రజాపాలన 99 డేస్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. డైలీ మార్నింగ్ పర్యటిస్తూ పౌర సేవల నిర్వహణను పరిశీలిస్తూనే తన పర్యటనలో ఎక్కడైనా నిర్మాణంలో ఉన్న భవనం కన్పిస్తే చాలు, నేరుగా అక్కడకు వెళ్లి, నిర్మాణానికి అనుమతులున్నాయా? అన్న విషయాన్ని వెరిఫై చేస్తున్నారు. అంతటితో ఆగని కమిషనర్ పర్మిషన్ పత్రాలు తెప్పించుకుని, టౌన్ ప్లానింగ్ విభాగం ఆమోదించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరుగుతుందా? అన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.
సైబరాబాద్‌లో కూడా..
ముఖ్యంగా సెట్ బ్యాక్ లు సాంక్షన్ చేసిన ప్లాన్ ప్రకారం ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశిస్తున్నారు. సైబరాబాద్‌లో కూడా కమిషనర్ సృజన అన్ని విభాగాలకు చెందిన అంశాలు కవర్ అయ్యేలా పర్యటనలు కొనసాగిస్తున్నారు. వ్యాపార సంస్థలు ఖచ్చితంగా డస్ట్ బిన్లను వినియోగించాలని తేల్చి చెప్పారు. డస్ట్ బిన్లు లేని వ్యాపార సంస్థలు తమ వ్యాపారాలను కొనసాగించొద్దంటూ నో బిన్..నో బిజినెస్ అన్న నిబంధనను అమలు చేస్తున్నారు. దీంతో సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటున్న వ్యాపార సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో ఇలాంటి తరహా చర్యలు కరువయ్యాయి. పైగా అక్రమ నిర్మాణాల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు.
Also read: రవాణా శాఖలో లేడీ బాస్‌ల కష్టాలు.. హైవేల పై లేడీ ఆఫీసర్ల ఆవస్థలు

