Jio Premium 5G: దేశంలోని అతిపెద్ద టెలికాం రంగ సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ప్రస్తుతం భారత్ లో 5G స్టాండ్ అలోన్ ఆర్కిటెక్చర్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థ కూడా ఇదే కావడం విశేషం.
ఈ క్రమంలోనే ప్రీమియం 5G సేవలను సైతం దేశంలో తీసుకొచ్చేందుకు గత కొద్ది కాలంగా జియో తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ సేవలను అందించడానికి సాంకేతికంగా జియో సిద్ధంగా ఉన్నప్పటికీ.. రెగ్యులేటరి సంస్థల అనుమతి కోసం ఎదురుచూడాల్సి వస్తోందని జియో ముఖ్య అధికారి తాజాగా తెలిపారు.
‘ప్రీమియం 5G సేవలకు సిద్ధమే’
రియలన్స్ ఇండస్ట్రీస్ పోస్ట్ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ లో జియో ఇన్ఫోకామ్ వ్యూహ విభాగాధిపతి అన్షుమాన్ థాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీమియం నెట్ వర్క్ మార్కెట్లోకి రావడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న వనరులతో దేశంలో 5G ప్రీమియం సేవలను అందించగలమని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
నెట్‌వర్క్ స్లైసింగ్
రిలయన్స్ జియో తన స్వదేశీ సాంకేతికత ‘నెట్‌వర్క్ స్లైసింగ్’ను ఉపయోగించి ప్రీమియం 5జీ సేవలను అందించాలని భావిస్తోంది. దీని ద్వారా క్లౌడ్ గేమింగ్ వంటి హై ఎండ్ సేవల కోసం ప్రత్యేకమైన, వేగవంతమైన నెట్‌వర్క్‌ను అందించేందుకు వీలు కలుగుతుంది. అయితే సాధారణ వినియోగదారులకు ఈ తరహా సేవలు అందించే విషయంలో నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎలాంటి వివక్ష లేకుండా సేవలు అందించాలనే నిబంధనల దృష్ట్యా.. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం జియో జాగ్రత్త పడుతోంది.
ఏసీ గ్యాస్ లీక్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. నెక్ట్స్ టార్గెట్ మీరే కావొచ్చు!
దీనివల్ల ఏంటి ప్రయోజనం?
సామాన్యులకు ప్రీమియం 5G సేవలు అందుబాటులోకి వస్తే.. అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. గేమింగ్, హై-క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్ చేసే వారికి ఈ ప్రీమియం ప్లాన్లు అద్భుతమైన వేగాన్ని అందిస్తాయి. అయితే ఈ ప్రీమియం సేవలను పొందాలనుకేవారు సాధారణ ప్లాన్ల కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి రావొచ్చు. దీనివల్ల కంపెనీ సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

