Bandi Sanjay: కరీంనగర్ జిల్లా వేదికగా కేంద్ర మంత్ర బండి సంజయ్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ ఫలితాలు కేవలం గెలుపోటములు మాత్రమే కావని, దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పుకు సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక నిర్ణయాలను వ్యతిరేకించిన పార్టీలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఆయన ఘాటుగా విమర్శించారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేసిన సంజయ్, దేశ ప్రజలంతా బెంగాల్‌లో మార్పు రావాలని కోరుకున్నారని చెప్పారు. బెంగాల్ ఫలితం దేశ రాజకీయ గమనాన్ని మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఆశించిన స్థాయిలోనే ఫలితాలు వస్తున్నాయని, ఇది పార్టీ బలోపేతానికి నిదర్శమని అన్నారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ శకం ముగిసిందని, ఆ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై స్వయంగా ఆ పార్టీ నేతల్లోనే నమ్మకం లేదని, ఆయనను ఒక నాయకుడిగా ఎవరూ గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు.
మెుత్తానికి ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు విపక్షాల కళ్లు తెరిపిస్తాయని, బీజేపీకి ఉన్న ప్రజాదరణను మరోసారి నిరూపిస్తాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది.

