Ebola Virus: ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్‌కు సంబంధించి దేశంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది.
ఎబోలా ప్రభావిత దేశాల గుండా ప్రయాణించిన వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కలవర పెడుతున్న ఎబోలా వైరస్
ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది ఎబోలా వైరస్. కాంగో, ఉగాండా వంటి దేశాల్లో ఈ వైరస్ చుట్టేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యంత ప్రమాదకరమైన బుండి బుగ్యో స్ట్రెయిన్ వైరస్ ద్వారా ఎబోలా వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది.
కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భారతీయులను కోరింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. మూడువారాలుగా ఒక్క కేసు నమోదు కాలేదు
అయితే ముందస్తు జాగ్రత్తగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి చేసింది కేంద్రం. గడిచిన మూడు వారాలుగా ఎబోలా ప్రభావిత దేశాల నుంచి నేరుగా వచ్చినవారు, ఆ దేశాల మీదుగా ప్రయాణించిన కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచన చేసింది.
ప్రయాణికులలో జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, శరీరంలో ఎక్కడైనా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే స్థానిక ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. లేకుంటే సాయం కోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1075 కు కాల్ చేయాలని కోరింది.
కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా
సకాలంలో వైద్య సహాయం పొందడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవడమేకాదు వ్యాధి ఇతరులకు సోకకుండా నిరోధించవచ్చు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పంపింది కేంద్రం. ఆసుపత్రులలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, ల్యాబొరేటరీలను సిద్ధంగా ఉంచాలని ఐసీఎంఆర్-ఎన్డీడీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

