Telangana Politics: తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆమె కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది.
కాకపోతే పేరుని మార్చింది. తెలంగాణ రక్షణ సేన పార్టీగా పేరును ఖరారు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు లేఖను కవితకు అందజేశారు.
కవితకు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు
ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా బహిరంగ సభలో తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. సభలో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పేరు వెల్లడించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆ పేరుకు బదులుగా మరొక పేరు ఖరారు చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదముద్ర వేసింది.
ఆ పేరును కవిత పార్టీకి కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం లేఖ పంపింది. దీంతో కవిత పార్టీకి సంబంధించి కీలక ఘట్టం పూర్తయింది. ఇకపై కవిత తన రాజకీయ కార్యకలాపాలను తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. తెలుగు పేరులో చిన్న మార్పులు చేసినప్పటికీ టీఆర్ఎస్‌గా పిలుచుకునే అవకాశం కల్పించింది.
తెలంగాణ రక్షణ సేనగా ఖరారు చేసిన ఈసీ
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ పేరు ఓకే చేసినట్టు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కవిత పార్టీ ఓకే కావడంతో ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా గమనిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిందని తెలియగానే కాస్త రిలీఫ్ అయిన కీలక నేతలు, ఇంగ్లీష్ పేరు అదే కావడంతో సైలెంట్ అయ్యారు.
ఇకపై ఆమె వేసిన ప్రతీ అడుగు జాగ్రత్తగా గమనించి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించినట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. కవిత మద్దతుదారుల వెర్షన్ మరోలా ఉంది. మా పార్టీ పేరు టీఆర్ఎస్ అని అంటున్నారు. కాకపోతే రాష్ట్రానికి బదులు రక్షణ పేరు మార్చారని అంటున్నారు. మరోవైపు పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు కవిత. తెలంగాణ రక్షణ సేన కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడం సంతోషిస్తున్నామని రాసుకొచ్చారు.

