BV Raghavulu: విశాఖపట్నం వేదికగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ఇటీవల ప్రజలకు ఇస్తున్న 'పొదుపు' సూచనలు వినడానికి బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో అవి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బంగారం కొనవద్దు, విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవద్దు, సేంద్రియ వ్యవసాయం చేయాలంటూ మోదీ చెబుతున్న మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం వల్ల శ్రీలంక ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో చూశామని, ఇప్పుడు భారత్‌లో కూడా అదే ప్రయోగాలు చేయడం రైతులను మోసం చేయడమేనని మండిపడ్డారు.
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పక్కదారి పట్టించడానికే మోదీ ఇలాంటి వింత సూచనలు చేస్తున్నారని రాఘవులు ఆరోపించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించడం వెనుక రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలను భారీగా పెంచే కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకు నీతులు చెప్పడం మానేసి, ప్రపంచ శాంతి కోసం అమెరికా యుద్ధం ఆపాలని మోదీ డిమాండ్ చేయాలని సూచించారు.
మరోవైపు నీట్ (NEET) పరీక్షలో జరుగుతున్న అవకతవకల వల్ల సుమారు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నీట్ పరీక్షను రద్దు చేసి, నష్టపోయిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని, దాని ఆధునీకరణకు కొత్త చైర్మన్ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణను అడ్డుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాఘవులు డిమాండ్ చేశారు.

