Ketepalli Fire: నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక వ్యవసాయ పొలంలో కొందరు వ్యక్తులు ఎండిపోయిన గడ్డిని తగలబెట్టారు.
అయితే, ఆ సమయంలో గాలి బలంగా వీస్తుండటంతో మంటలు ఒక్కసారిగా అదుపు తప్పాయి. పొలం నుంచి లేచిన నిప్పురవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణ వరకు వ్యాపించాయి.
అక్కడ వివిధ కేసుల్లో సీజ్ చేసి పార్కింగ్ ఉంచిన వాహనాలకు ఈ మంటలు అంటుకున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు బైక్‌లు, ఇతర వాహనాలు క్షణాల్లోనే పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అప్పటికే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. నిర్లక్ష్యంగా గడ్డికి నిప్పు పెట్టిన వారిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

