Panchayat Irregularities: స్వేచ్చ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం కొండాపురం గ్రామపంచాయతీలో పరిపాలనా వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
గ్రామ కార్యదర్శి గత పది రోజులుగా విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రజలకు అవసరమైన సేవలు పూర్తిగా స్తంభించి పోయాయని, దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన పత్రాల కోసం ప్రజలు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించినప్పటికీ సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడంతో వారి పనులు నెలల తరబడి పెండింగ్‌లో పడుతున్నాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత కలిగిన గ్రామపంచాయతీ కార్యాలయమే ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సర్టిఫికెట్ల జారీ విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలను కూడా గ్రామస్తులు ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఉచితంగా, పారదర్శకంగా అందాల్సిన సేవల విషయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నిధుల వినియోగంపై అనుమానాలు
గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై కూడా గ్రామస్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గ్రామంలో గత రెండేళ్లుగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఎటువంటి సేవలు నిర్వహించకపోయినప్పటికీ, దానికి సంబంధించిన బిల్లులు ఎత్తినట్లు తమకు సమాచారం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గ్రామంలో చేపట్టని అభివృద్ధి పనులకు సైతం బిల్లులు మంజూరు చేసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయి స్తున్న నిధులు నిజంగా ప్రజల అవసరాలకే వినియోగించబడుతున్నాయా, లేక కాగితాలకే పరిమితమవుతున్నాయా అనే అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Also read: నెలలోపే ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్… కానీ చిన్న ట్విస్ట్
ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
గ్రామ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రజలకు సేవలందకపోవడం, సర్టిఫికెట్ల జారీలో అవకతవకల ఆరోపణలు, గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై తలెత్తిన అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికితీయాలని గ్రామస్తులు ఎంపీడీవోను కోరారు. ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడిన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామపంచాయతీ వ్యవస్థ పైనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో కొండాపురం గ్రామస్తుల ఫిర్యాదుపై అధికారులు ఎలా స్పందిస్తా రన్నది ఆసక్తికరంగా మారింది. గ్రామస్థులు లేవనెత్తిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో విచారణలో తేలాల్సి ఉంది.
Also read: తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. బీజేపీకి అన్నామలై గుడ్ బై? త్వరలో కొత్తపార్టీ!

