Credit Card Lost: క్రెడిట్ కార్డు పోయినా లేదా అది చోరీ అయినా.. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. అనధికార లావాదేవీలు, ఆర్థిక నేరాలు, నిధుల దుర్వినియోగం అవ్వగుండా కార్డుదారుడు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థలో క్రెడిట్ కార్డు పోయిన విషయాన్ని రిపోర్ట్ చేయడం కొన్ని నిమిషాల ఆలస్యం అయినా, ఆ క్రెడిట్ కార్డ్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డు చోరీ అయినా లేదా పోగొట్టుకున్నా పాటించాల్సిన 6 స్టెప్స్ ఇవే
1. క్రెడిట్ కార్డును వెంటనే బ్లాక్ చేయండి
కార్డు పోయిన వెంటనే బ్లాక్ చేయండి. దీన్ని మూడు విధాలుగా బ్లాక్ చేయవచ్చు.
- బ్యాంకు మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి
- ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ చేయడం ద్వారా
- బ్యాంకు కస్టమర్ సర్వీస్ టీమ్ కు ఫోన్ చేయడం ద్వారా
మీరు టైమ్ వేస్ట్ చేయకుండా, సాధ్యమైనంత వరకు మూడు విధాలలో ఏదో విధంగా కార్డు బ్లాక్ చేయడానికి ప్రయత్నించాలి. దీంతో కార్డు లావాదేవీలన్నీ నిలిపివేస్తారు. దీంతో ఆర్థిక మోసాలు జరగకుండా ఉంటాయి.
2. లావాదేవీలను జాగ్రత్తగా చెక్ చేయండి.
మీ క్రెడిట్ కార్డు బ్లాక్ చేసినప్పటికీ, ఇటీవలి లావాదేవీలు, SMS హెచ్చరికలు, ఇ-మెయిల్ నోటిఫికేషన్‌లు, బ్యాంకింగ్ అప్లికేషన్ హిస్టరీని చెక్ చేయండి. ఒకవేళ కార్డు చోరీ అయితే దానిని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించారని భావించాలి. మీ లావాదేవీలను తనిఖీ చేసి అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలి.
3. బ్యాంకుకు ఫిర్యాదు చేయండి
క్రెడిట్ కార్డులో అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకు కు ఫిర్యాదు చేసి రిఫరెన్స్ నంబర్ పొందండి. ఈ నెంబర్ ఈ ఫిర్యాదు స్టేటస్ ను చెక్ చేయడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో ఏదైనా న్యాయపరమైన సమస్య తలెత్తినప్పుడు ఇది అవసరం కావచ్చు.
4. అనధికార లావాదేవీలు
ఒకవేళ మోసపూరిత లావాదేవీలను గుర్తిస్తే.. వెంటనే ఫిర్యాదు చేయాలి. బ్యాంకింగ్ సంస్థలు.. నష్టాన్ని వెంటనే రిపోర్ట్ చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటాయి. క్రెడిట్ కార్డు నిబంధనలు, షరతులను జాగ్రత్తగా అడిగి తెలుసుకోండి.
5. డిజిటల్ ఖాతాలను సురక్షితంగా
బ్యాంకింగ్ అప్లికేషన్, ఇ-మెయిల్, పేమెంట్ వాలెట్‌లకు సంబంధించిన పాస్‌కీలు, పాస్‌వర్డ్‌లు, ఇతర కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డు బ్యాంకింగ్ ఖాతాల సెక్యూరిటీని పెంచుకోవడానికి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, ట్రాన్సాక్షన్ అలర్ట్‌లను ఎనేబుల్ చేయండి.
6. రీప్లేస్‌మెంట్ కార్డు
క్రెడిట్ కార్డును బ్లాక్ చేసిన తర్వాత కొత్త కార్డు కోసం అప్లై చేయండి. కొత్త క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసే ముందు, పాత కార్డు పూర్తిగా బ్లాక్ అయిందని నిర్ణయించుకోండి.
7.ఎఫ్ఐఆర్ నమోదు
కార్డు పోయిన విషయాన్ని బ్యాంకుకు తెలియజేసిన తర్వాత, ఈ సంఘటనను అధికారికంగా నమోదు చేయడం ముఖ్యం. మీ క్రెడిట్ కార్డు చోరీకి గురైతే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో FIR దాఖలు చేసి, ఆ రిపోర్టును కాపీ మీ వద్ద ఉంచుకోండి.

