Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

Big TV Live 1 week ago

Food Waste: సాధారణంగా గిన్నెల్లో మిగిలిపోయిన ఆహారాన్ని, కూరగాయల వ్యర్థాలను అందరూ చెత్తలో పారేస్తుంటారు. కానీ వాటితో బహుళ అంతస్తు భవనాలను నిర్మించవచ్చని ఎప్పుడైనా ఊహించారా వినడానికి కాస్త వింతగా అనిపించినా, జపాన్‌లోని ప్రసిద్ధ టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు దీనిని నిజం చేసి చూపించారు.

అరటి, నారింజ తొక్కలు, క్యాబేజీ ఆకులు వంటి ఆహార వ్యర్థాలను ఉపయోగించి కాంక్రీట్ కంటే ఎంతో బలమైన, పర్యావరణహితమైన భవన నిర్మాణ సామగ్రిని వారు తయారు చేశారు.

ఆహార వ్యర్థాలను ఎండబెట్టి..

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల టన్నుల ఆహార పదార్థాలు వృథాగా చెత్తకుప్పల్లో చేరుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే క్రమంలో జపనీస్ పరిశోధకులు ఒక కొత్త ఆలోచన చేశారు. ఆహార వ్యర్థాలను ఎండబెట్టి, వాటిని మెత్తటి పౌడర్‌గా మార్చి, ఆపై అధిక ఉష్ణోగ్రత, తీవ్రమైన ఒత్తిడికి గురిచేశారు. ఈ ప్రక్రియ ద్వారా దట్టమైన, గట్టి బ్లాక్‌లు రూపుదిద్దుకున్నాయి. ఎటువంటి రసాయనాలు, బైండింగ్ ఏజెంట్లు కలపకుండా కేవలం ఆహారంలో ఉండే సహజ పాలిసాకరైడ్లు (షుగర్లు) మాత్రమే ఇక్కడ గ్లూ లాగా పనిచేయడం విశేషం.

చైనా క్యాబేజీ మ్యాజిక్

ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు వేర్వేరు కూరగాయలు, పండ్ల తొక్కలతో ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో చైనా క్యాబేజీ (Chinese Cabbage)తో తయారు చేసిన నమూనా అత్యంత ప్రతిభను కనబరిచంది. దీని బెండింగ్ బలం (Flexural Strength) సాధారణ కాంక్రీట్ కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ అని పరీక్షల్లో తేలింది. ఇతర పదార్థాలతో పోలిస్తే ఇది భూకంపాలు లేదా బరువైన ఒత్తిళ్లను చాలా సులభంగా తట్టుకోగలదని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతి ఆహార వ్యర్థం ద్వారా లభించిన పదార్థానికి ప్రత్యేక రంగు, వాసన ఉండటం విశేషం.

అత్యవసర వేళల్లో ఆకలి తీర్చేలా..

ఈ ప్రయోగంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ నిర్మాణ పదార్థాలు తినడానికి సైతం యోగ్యంగానే ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఇవి ఎలాంటి విషపూరిత రసాయనాలతో కూడుకున్నవి కావని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు నివాసంతో పాటు ఆహార భద్రతను కూడా ఇవి కల్పించగలవని అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక పునరావాస శిబిరాల నిర్మాణానికి వీటిని ఉపయోగిస్తే అవసరమైనప్పుడు వాటి భాగాలను నీటిలో ఉడకబెట్టుకుని ఆహారంగా కూడా తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ

బహుళ అంతస్తుల నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్ తయారీ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీగా కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. మరోవైపు కుళ్లిపోతున్న ఆహార వ్యర్థాల నుంచి మిథేన్ వంటి ప్రమాదకర వాయువులు వాతావరణంలోకి చేరుతున్నాయి. టోక్యో పరిశోధకుల ఈ నూతన ఆవిష్కరణ ద్వారా ఒకేసారి ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపించారు. ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్న ఈ పదార్థాన్ని భవిష్యత్తులో వాణిజ్యపరంగా అందుబాటులోకి తెస్తే భవన నిర్మాణ రంగం పూర్తి పర్యావరణహితంగా మారడమే కాకుండా భూగోళంపై వ్యర్థాల భారం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live