Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంచులో ఒంటరి సైనికుడి సర్వైవల్ ఫైట్.. యుద్ధం కంటే ప్రాణాల కోసం జరిగే ఈ పోరాటమే భయంకరం

మంచులో ఒంటరి సైనికుడి సర్వైవల్ ఫైట్.. యుద్ధం కంటే ప్రాణాల కోసం జరిగే ఈ పోరాటమే భయంకరం

Big TV Live 1 day ago

War Survival Drama: వార్ డ్రామాలు అంటే చాలా మందికి భారీ బాంబు దాడులు, ట్యాంకులు, వందల మంది సైనికుల మధ్య జరిగే పోరాటాలే గుర్తుకు వస్తాయి. కానీ కొన్నిసార్లు ఒకే ఒక్క సైనికుడి ప్రాణాల కోసం చేసే పోరాటమే యుద్ధం కంటే ఉత్కంఠగా అనిపిస్తుంది.

అలాంటి భావోద్వేగాలతో పాటు సర్వైవల్ ఎలిమెంట్స్‌ను మిళితం చేసిన హాలీవుడ్ వార్ యాక్షన్ డ్రామానే ‘లక్కీ స్ట్రైక్’ (Lucky Strike 2026). రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మంచు అడవుల్లో ఒంటరిగా చిక్కుకున్న సైనికుడి కథ ఎలా సాగింది ? సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

1944 డిసెంబర్. రెండో ప్రపంచ యుద్ధం కీలక దశలో ఉన్న సమయం అది. ‘బాటిల్ ఆఫ్ ది బల్జ్’ సందర్భంగా అమెరికన్ సైన్యానికి చెందిన కెప్టెన్ జాన్ కాజిల్ తన బృందంతో కలిసి నాజీ సైన్యాన్ని ఎదుర్కొనే మిషన్‌లో పాల్గొంటాడు. మిషన్ సాఫీగా సాగుతున్నట్టే కనిపించినా, అనుకోకుండా నాజీ సైన్యం మెరుపుదాడి చేస్తుంది. ఆ దాడిలో జాన్ కాజిల్ మినహా అతని బృందంలోని సైనికులంతా ప్రాణాలు కోల్పోతారు. తీవ్రంగా గాయపడిన జాన్, శత్రువుల ఆధీనంలోని మంచు అడవిలో ఒంటరిగా చిక్కుకుపోతాడు.

చుట్టూ శత్రువులే, గడ్డకట్టే చలి. ఆహారం, సహాయం లేదు. అలాంటి పరిస్థితిలో అతని వద్ద మిగిలింది ఒక ఆధునిక మిలిటరీ ఫీల్డ్ రేడియో, మరోవైపు ‘లక్కీ స్ట్రైక్’ సిగరెట్ల ప్యాకెట్ మాత్రమే. ఆ రేడియో ద్వారా తన పైఅధికారులతో సంప్రదించేందుకు జాన్ చేసే ప్రయత్నాలు కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ప్రతి క్షణం నాజీ సైనికులు అతని కోసం గాలిస్తుండగా, మరోవైపు బేస్ క్యాంప్‌కు తన ఆచూకీ చేరవేయాల్సిన బాధ్యత కూడా అతనిపైనే ఉంటుంది.

ప్రమాదకరమైన అడవులు దాటుతూ, శత్రువుల కళ్లను తప్పించుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఒక స్థానిక కుటుంబం అతనికి ఆశ్రయం ఇస్తుంది. కానీ ఆ నిర్ణయం వారినీ ప్రమాదంలోకి నెడుతుంది. చివరకు జాన్ తన తెలివితేటలతో నాజీలను మోసం చేసి సురక్షితంగా బయటపడగలిగాడా ? లేక యుద్ధం అతని ప్రయాణానికి ముగింపు పలికిందా ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

‘లక్కీ స్ట్రైక్’లో భారీ యుద్ధ సన్నివేశాల కంటే ఒక సైనికుడి మానసిక ధైర్యం, ఒంటరి పోరాటాన్ని మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. స్కాట్ ఈస్ట్‌వుడ్ ఇందులో ప్రధాన పాత్రను పోషించగా, దర్శకుడు రాడ్ లూరీ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆగస్టు 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. కేవలం ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే వీక్షించవచ్చు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమాను చూడొచ్చు. యుద్ధం నేపథ్యంలో సాగే సర్వైవల్ కథలు, భావోద్వేగాలతో కూడిన మిలిటరీ డ్రామాలు నచ్చితే ‘లక్కీ స్ట్రైక్’ మూవీ మీ కోసమే. ఒక సైనికుడి ధైర్యం, ప్రాణాల కోసం చేసిన పోరాటం, ఉత్కంఠభరితమైన కథనం ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. హాలీవుడ్ వార్ డ్రామాలను ఇష్టపడే వారు అస్సలు మిస్ అవ్వొద్దు.

సమంత, తాప్సీ సూపర్ హిట్ సినిమాలకు డిలీట్ డేట్ ఫిక్స్… ఓటీటీలో చూసేందుకు ఇదే చివరి ఛాన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live