Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేడ్చల్‌లో కార్పొరేషన్ పేరిట ఘోరం.. కమిషనర్ ముందే గళమెత్తిన జనం!

మేడ్చల్‌లో కార్పొరేషన్ పేరిట ఘోరం.. కమిషనర్ ముందే గళమెత్తిన జనం!

Big TV Live 1 week ago

Medchal Civic Issues: స్వేచ్ఛ బ్యూరో: పొంగిపొర్లుతున్న డ్రైనేజీ, గుంతలమయంగా మారిన రోడ్లు, మూతలు లేని మ్యాన్‌హోల్స్, అధ్వాన్నంగా మారిన బస్టాండ్, కలుషితమవుతున్న నీటి వనరులు, సక్రమంగా లేని నీటి సరఫరా వంటి మేడ్చల్ సమస్యలపై ప్రజలు, నాయకులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఎదుట ఏకరువు పెట్టారు.

మున్సిపాలిటీగా ఉన్నప్పుడే పరిస్థితి బాగుండేదని, కార్పొరేషన్‌గా మారిన తర్వాత సమస్యల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని పార్టీలకతీతంగా ఆందోళన వ్యక్తం చేశారు.

వన్ వార్డు ఎవరీ డే కార్యక్రమం..

ఫిర్యాదు చేసినా కనీసం మ్యాన్‌హోల్స్‌పై మూతలు కూడా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. వర్షాలు పడుతున్నా, బోనాల పండుగ సమీపిస్తున్నా కనీసం రోడ్లను మరమ్మతు చేయడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ‘వన్ వార్డు ఎవరీ డే’ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్, లలిత్ కుమార్ మేడ్చల్ డివిజన్‌కు వచ్చారు. ఇందిరానగర్‌లోని అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించిన సమావేశంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన సదుపాయాలపై ఆరా తీశారు. సమస్యలపై వినతులు స్వీకరించారు.

దీపిక నర్సింహారెడ్డి మాట్లాడుతూ..

ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ దీపిక నర్సింహారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం-హౌసింగ్ దారిలో రోడ్డు అధ్వాన్నంగా మారిందని, డ్రైనేజీ కోసం తవ్విన రోడ్డును తిరిగి నిర్మించకపోవడంతో వర్షాకాలంలో బురదమయంగా మారుతోందన్నారు. ఎత్తుపల్లాలు ఉన్న రోడ్డుపై ప్రయాణిస్తూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. కిందిబస్తీ, వినాయక్‌నగర్, మార్కెట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. తుమ్మ చెరువు, పెద్ద చెరువు డ్రైనేజీ నీటితో కలుషితమవుతున్నాయని, ఎస్‌టీపీ (STP) ఏర్పాటు చేసి నీరు కలుషితం కాకుండా చూడాలని కోరారు. తుమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో ఉన్నప్పుడు రూ.26 వేల వేతనం పొందిన కార్మికులకు, కార్పొరేషన్‌లో రూ.19 వేలే అందుతున్నాయని తెలిపారు.

కమిషనర్ స్పందన..

పెరిగిన ధరల నేపథ్యంలో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కమిషనర్ సృజన స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అనుమతులు రాగానే వేతనాలు పెంచుతామని తెలిపారు.మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శైలజ హరినాథ్ మాట్లాడుతూ మేడ్చల్ డివిజన్ పరిధిలోని చాలా రోడ్లు గుంతలమయంగా మారాయని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందన్నారు. వివేకానంద విగ్రహం నుంచి గ్రంథాలయం వరకు రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తోందని తెలిపారు. తుమ్మ చెరువు పూడిక తీసి, కలుషితం కాకుండా చూడాలని కోరారు.

మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ..

బీఆర్ఎస్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గం ఐదేళ్ల కాలంలో అభివృద్ధి పనులు జరిగాయని, మేడ్చల్ కార్పొరేషన్‌గా మారి ఏడాది అవుతున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, సమస్యలు కూడా పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.అధ్వాన్నంగా మారిన గ్రంథాలయం, సూర్యనగర్, వినాయక్‌నగర్, ముకుంద్ థియేటర్, రాయిలాపూర్, గిర్మాపూర్ తదితర ప్రాంతాల రోడ్లను బాగు చేయాలని కోరారు. గ్రంథాలయం రోడ్డులోనే పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయని, రాయిలాపూర్, గిర్మాపూర్ ప్రాంతాలకు ఇదే ప్రధాన మార్గమని తెలిపారు.వెంటనే మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

అధికారులు మాట్లాడుతూ..

వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు నడికొప్పు నాగరాజు, సత్యనారాయణ, చీర్ల రమేశ్, శ్రీనివాస్ గౌడ్, మణికంఠ గౌడ్, విష్ణుచారి తదితరులు మాట్లాడుతూ చెరువులు కలుషితం కాకుండా చూడాలని, రోడ్లపై గుంతలను పూడ్చివేయాలని, నీటి సరఫరా పెంచాలని, కొత్త కాలనీలకు నీరు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని, పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని, డంపింగ్ యార్డును తరలించాలని, బోడ్లకు ఆధారమైన తుమ్మ చెరువు నుంచి అక్రమంగా నీటి తరలింపును అడ్డుకోవాలని, బోనాల పండుగకు కిందిబస్తీలో అడ్డంకిగా మారిన రోడ్డును వెంటనే బాగు చేయాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు..

మున్సిపాలిటీ పాలకవర్గం చివరి దశలో రూ.22 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారని, కానీ అవి కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఆ పనులతో పాటు ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన పనులు కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుధాంశు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live