Fuel Savings: చిన్న పదవి వచ్చినా సరే కొందరైతే పెద్ద పెద్ద కాన్వాయ్ లు మెయింటేన్ చేస్తారు. ఇక పెద్ద పెద్ద నాయకుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
భద్రత అవసరమే. దీన్ని ఎవరూ కాదనలేరు. అయితే అంతకు మించి కాన్వాయ్ ఉంటోందా అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుతో చాలా మంది పొదుపు బాట పడుతున్నారు. కాన్వాయ్ లు తగ్గిస్తున్నారు. నో వెహికిల్ డే అంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో ప్రయాణిస్తున్నారు. మరి ఇది ఎన్ని రోజులన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారుతోంది.
మోడీ కాన్వాయ్‌కు కత్తెర
ప్రధాని మోడీ పిలుపుతో చాలా మంది కదులుతున్నారు కూడా. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకుంటున్నారు. పొదుపు సూత్రాలపై చెప్పడమే కాదు.. తనతోనే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. ప్రధాని మోడీ తన సొంత భద్రతా ప్రోటోకాల్ కు ఎలాంటి సమస్య కలగకుండా, తన అధికారిక కాన్వాయ్‌ను కేవలం 2 వాహనాలకు పరిమితం చేసుకున్నారు. అసోం, గుజరాత్ పర్యటనలలో ఆయన ఈ చిన్న కాన్వాయ్ తోనే ప్రయాణించి దేశానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి కొనుగోళ్లు జరపకుండానే, కాన్వాయ్ లలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని ప్రధాని ఆదేశించారు.
ప్రధాని పిలుపు.. యాక్షన్‌లోకి అమిత్ షా
ప్రధాని మోడీ అధికారిక కాన్వాయ్‌లో సాధారణంగా 12 నుంచి 15 వాహనాలు ఉండేవి. అయితే ప్రధాని భద్రతా నియమావళి బ్లూ బుక్ ప్రోటోకాల్ ప్రకారం ఈ సంఖ్య 14 నుంచి 17 వాహనాలుగా ఉంటుంది. స్థానిక రాష్ట్ర పోలీసుల భద్రతను కూడా కలిపితే కొన్నిసార్లు ఈ మొత్తం వెహికిల్స్ సంఖ్య 30 నుంచి 40 వరకు పెరిగేది. ఇందులో బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామింగ్ ఎక్విప్ మెంట్ వెహికిల్, అంబులెన్స్ ఉండేవి. ఓవరాల్ గా 2 వాహనాలకే కాన్వాయ్ ను కుదించుకున్నారు. ప్రధాని మోడీకి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సగానికి పైగా కాన్వాయ్ తగ్గించుకున్నారు. ప్రధాని పిలుపు వచ్చిన కొద్ది గంటల్లోనే తన అధికారిక కాన్వాయ్‌ను అమిత్ షా సగానికి పైగా తగ్గించుకున్నారు. ఆయన ఢిల్లీలోని తన నివాసం నుంచి అతి తక్కువ వాహనాలతో బయటకు వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బండి సంజయ్ ని బర్తరఫ్ చేయండి.. ప్రధాని మోదీకి కవిత సంచలన లేఖ!
అమిత్ షా కొత్త సందేశం
దేశంలోనే అత్యున్నత రక్షణ విభాగమైన Z+ కేటగిరీ భద్రత ఉండే అమిత్ షా అధికారిక కాన్వాయ్‌లో సాధారణంగా 12 నుంచి 15 వెహికిల్స్ ఉండేవి. కొన్ని ప్రత్యేక సున్నితమైన ప్రాంతాలు లేదా రాష్ట్రాల పర్యటనల సమయాల్లో స్థానిక పోలీసుల రక్షణ వాహనాలతో కలిపి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆయన కేవలం 3 నుంచి 4 వాహనాల కాన్వాయ్‌తో మాత్రమే ఢిల్లీలో ప్రయాణిస్తున్నారు.
ఢిల్లీలో నో వెహికల్ డే
ఇక కాలుష్యంతో ఉండే ఢిల్లీలో అయితే అక్కడి ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రధాని పిలుపునకు స్పందిస్తూ కొన్ని ఆంక్షలు, మరికొన్ని సంస్కరణలను ప్రకటించారు. వారంలో ఒక రోజును ఢిల్లీ ప్రభుత్వం స్వచ్ఛందంగా నో వెహికల్ డే గా పాటిస్తోంది. ఆ రోజు ప్రజాప్రతినిధులు, ప్రజలు వ్యక్తిగత వాహనాలను పక్కనబెట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని కోరారు. అలాగే ప్రతి సోమవారం మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తప్పనిసరిగా ఢిల్లీ మెట్రోలోనే ప్రయాణించాలనే నిబంధనను తెచ్చారు. ఇక ఫ్యూయెల్ వాడకాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయనున్నారు. ప్రైవేట్ రంగానికి కూడా దీనిపై అడ్వైజరీ జారీ చేశారు. సీఎం రేఖా గుప్తా తన సొంత కాన్వాయ్‌ను 60% తగ్గించి, కేవలం 4 వాహనాలకే పరిమితం చేసుకున్నారు. అధికారుల పెట్రోల్ కోటాను 20% తగ్గించారు. రాబోయే 6 నెలల వరకు ప్రభుత్వం కొత్త వాహనాలేవీ కొనకూడదని, ఏడాది పాటు మంత్రుల విదేశీ పర్యటనలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా సీఎంల కొత్త ట్రెండ్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సెక్రెటేరియట్ కు బుల్లెట్ బైక్ పై స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అనవసర ప్రయాణాలను నివారించాలని, కాన్వాయ్ వాడకాన్ని చాలా వరకు తగ్గించాలని చీఫ్ సెక్రటరీతో పాటు ప్రజాప్రతినిధులందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ తన కాన్వాయ్ సైజును తగ్గించుకోవడమే కాకుండా, రాబోయే రోజుల్లో అధికారిక అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు ప్రకటించారు. బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఏకంగా సెక్రటేరియట్ కు నడుచుకుంటూ వెళ్లారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రులు, అధికారుల వాహనాలు 50% తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, సైక్లింగ్, కార్ పూలింగ్, EVల వాడకాన్ని ప్రోత్సహించాలంటున్నారు. వారంలో ఒక రోజు నో వెహికల్ డే గా ప్రకటించారు. అలాగే గుజరాత్ లో CM కాన్వాయ్ 2 వాహనాలకు పరిమితం చేసుకున్నారు. మంత్రుల పైలట్ కార్లు తొలగించారు. వర్చువల్ మీటింగ్స్ పెట్టే పనిలో ఉన్నారు.
కూలర్ కావాలా? ఈ ఛాన్స్ అస్సలు వదలకండి.. అమెజాన్‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్స్!
విమానాలు, హెలికాప్టర్లకు బ్రేక్
అటు పలు రాష్ట్రాల గవర్నర్లు కూడా మేము సైతం అంటున్నారు. గుజరాత్ గవర్నర్ ఈ సమయంలో హెలికాప్టర్లు, విమాన ప్రయాణాలను పూర్తిగా పక్కనబెట్టారు. గుజరాత్ లోపల పర్యటించడానికి ఆయన సాధారణ రైళ్లు, బస్సులు ఉపయోగిస్తానని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన కాన్వాయ్ సైజ్ కూడా తగ్గించుకున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ లోక్ భవన్‌ను ఇంధన పరిరక్షణ జోన్ గా ప్రకటించారు. అటు గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ రెండోసారి కూడా ఇలాంటి అప్పీలే చేశారు. వర్క్ ఫ్రం హోం, వర్చువల్ మీటింగ్స్ ను సీరియస్ గా తీసుకోవాలన్నారు. మొత్తంగా ప్రధాని ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో దేశవ్యాప్తంగా విలాసవంతమైన విఐపి కల్చర్ స్థానంలో ఫ్యూయెల్ ఆదాపై ఆర్థిక క్రమశిక్షణతో సరికొత్త గ్రీన్ గవర్నెన్స్ మార్పు మొదలైనట్లే కనిపిస్తోంది.
చంద్రబాబు సర్కార్ యాక్షన్ ప్లాన్
పశ్చిమాసియా సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, ఇంధన కొరతను అధిగమించడానికి, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుపై ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పలు సంచలన, కఠినమైన పొదుపు నిర్ణయాలు తీసుకుంది. అందులో కీలకమైనవేంటో ఇప్పుడు చూద్దాం. రాబోయే కొన్నాళ్ల పాటు ఏపీ మంత్రుల విదేశీ పర్యటనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు క్యాబినెట్ నిర్ణయించింది. వీఐపీల కోసం ప్రత్యేక చాపర్లు లేదా విమానాల వినియోగాన్ని అత్యంత అత్యవసరమైతే తప్ప పూర్తిగా తగ్గించాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వారానికి ఒక రోజును నో వెహికల్ డే గా పాటించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఆ రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాలి.
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ లోని వాహనాలను 11 నుంచి కేవలం 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇదే పద్ధతిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా కచ్చితంగా పాటించాలని, అనవసర ఎస్కార్ట్ వాహనాలు వాడకూడదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి కేవలం ఒకే ఒక అధికారిక వాహనాన్ని ఉపయోగించాలని, గ్రూప్ మీటింగులకు వెళ్లేటప్పుడు కార్ పూలింగ్ విధానాన్ని ఫాలో కావాలన్నారు. ప్రధాని ప్రకటించిన పొదుపు సూచనలు పాటించాలని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు… ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని దిశానిర్దేశం చేశారు. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని.. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారాయన.
ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గ్రీన్ సిగ్నల్
ఆఫీసలకు రావాల్సిన అవసరం లేని కొన్ని ప్రత్యేక ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు, అధికారుల జిల్లాల పర్యటనల ఖర్చులను తగ్గించడానికి ఇకపై మెజారిటీ సమీక్షా సమావేశాలను వర్చువల్ ద్వారానే నిర్వహించాలని డిసైడ్ చేశారు. కరెంట్ వినియోగాన్ని, ఖర్చులను తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ టెంపరేచర్‌ను 24 నుండి 27 డిగ్రీల మధ్య మాత్రమే ఉంచాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే క్రమంలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని, అనవసర విలాసాలు తగ్గించుకోవడంతో పాటు బంగారం కొనుగోళ్లపై నియంత్రణ పాటించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
10 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లిన మంత్రి నిమ్మల
ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ఈ పొదుపు మంత్రంలో భాగస్వాములు కావాలని మై నేషన్, మై రెస్పాన్సిబులిటీ పేరుతో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అటు నో వెహికిల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల ఏకంగా 10 కిలోమీటర్లు ఎండలో సైకిల్ పైనే వెళ్లారు. చాలా మంది ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈవీ కార్లు, ఈవీ బైక్ లకు షిఫ్ట్ అవుతున్నారు.
ఈవీ బైక్‌పై కోటంరెడ్డి పర్యటన
ఇంధన పొదుపులో భాగంగా కార్లు, మంది మార్బలం లేకుండా ఎలక్ట్రికల్ బైక్ లో వెళ్లి రోడ్డు పనులు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎస్కార్ట్ తో పాటు కాన్వాయ్ ను రద్దు చేసి పర్యటించారు. 168 అభివృద్ది పనులకి ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో శంకుస్థాపనలు చేయించారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు సూచించే పొదుపు ప్రణాళికలు అందరూ పాటించాలన్నారు. అందుకే తాను ర్యాలీగా కాకుండా ఎలక్ట్రిక్ బైక్ పై ఒంటరిగా వచ్చానన్నారు.
మోడీ పిలుపుపై ఏపీ ఫోకస్
దేశ విదేశీ మారక నిల్వలపై భారం పడకుండా ఉండేందుకు కొన్నాళ్ల పాటు ప్రజలు అనవసరమైన బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని కూడా మోడీ పిలుపునివ్వడంతో ఆ దిశగా చర్యలకు సిద్ధమయ్యారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులనే కొనాలనడం, పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును స్పీడప్ చేసే విషయంపై ఫోకస్ పెంచారు. ఈ నిర్ణయాలన్నింటినీ పర్యవేక్షించేందుకు, అమలు తీరును నిరంతరం సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పొదుపు చర్యల వల్ల ఎంత ఇంధనం ఆదా అయింది, ఖజానాకు ఎంత సొమ్ము మిగిలింది అనే నివేదిక కూడా ఇవ్వనుంది.
టీడీపీ కీలక నిర్ణయం
అటు టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా భావించే మహానాడు నిర్వాహణపై కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించాలని డిసైడ్ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లోనే మహానాడు నిర్వహణకు రెడీ అయ్యారు. జిల్లాల నుంచి వర్చువల్‌గా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడే కార్యక్రమాలను వీక్షించేలా చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగబోతోంది.
లోకేశ్ కాన్వాయ్‌పై వైసీపీ విమర్శలు
అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించాలని, వాహనాల కాన్వాయ్‌ను తగ్గించుకున్నామని మంత్రి లోకేశ్ కూటమి ప్రభుత్వం మీడియాలో విస్తృతంగా పబ్లిసిటీ చేసుకున్నారని వైసీపీ విమర్శించింది. అయితే, ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ప్రత్యేక విమానంలో పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు వెళ్లిన లోకేశ్, అక్కడ దాదాపు 8 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌లో వెళ్లారని వైసీపీ విమర్శిస్తూ ట్వీట్ చేసింది. అయితే వీటిని టీడీపీ ఖడించింది. సమయం ఆదా కోసమే విమానంలో వెళ్లారన్నది.
కేంద్రంపై రేవంత్ రెడ్డి యుద్ధం.. తెలంగాణను మార్చేయబోయే '2047 మాస్టర్ ప్లాన్' ఇదే!
Story by: Anup, Big Tv

