Matrimonial Fraud: స్వేచ్ఛ బ్యూరో: కోటీశ్వరున్ని అంటూ మ్యాట్రిమోనియల్ సైట్లలో ప్రొఫైల్ అప్ లోడ్ చేసి యువతులను నుంచి డబ్బు గుంజుతున్న కేటుగాన్ని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో నిందితుడు ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20మందిని పెళ్లి పేర మోసం చేసినట్టుగా బయటపడింది. సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం నివాసి మండ వెంకట కామేశు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదించేందుకుగాను మ్యాట్రిమోనియల్ మోసాలు మొదలు పెట్టాడు. తెలుగు మ్యాట్రిమోని, రెడ్డి మ్యాట్రిమోని, బ్రాహ్మీణ్ మ్యాట్రిమోని, కమ్మ మ్యాట్రిమోని సైట్లలో తన ప్రొఫైల్ అప్ లోడ్ చేశాడు. దాంట్లో తనను తాను కోటీశ్వరున్నని.. పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నానని చెప్పుకొన్నాడు. ఇది చూసి ఎవరైనా యువతులు ఫోన్ చేస్తే వారితో పరిచయం చేసుకునేవాడు. ఆ తరువాత వాట్సాప్ కాల్స్ చేస్తూ.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెసెజీలు చేస్తూ అవతలి వారి నమ్మకాన్ని సంపాదించేవాడు.
ఒక్కసారి అవతలి వారు తన ఉచ్ఛులో చిక్కారని నమ్మకం కుదరగానే కొంచెం అర్జంట్ అని చెప్పి పెద్ద మొత్తాల్లో నగదును తన ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకోవటం మొదలు పెట్టాడు. దాంతోపాటు క్రెడిట్ కార్డుల వివరాలు, ఓటీపీ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని కూడా డబ్బు కొల్లగొట్టాడు. ఇలా సంపాదించిన డబ్బుతో ఆన్ లైన్ లో బెట్టింగులు ఆడటం.. గోవా వెళ్లి క్యాసినోల్లో ఎంజాయ్ చేయటం చేస్తున్నాడు.
కాగా, ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సైబరాబాద్ క్రైం పోలీసులు మంగళవారం మండ వెంకట కామేశును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. డీసీపీ సాయిమనోహర్ మాట్లాడుతూ మ్యాట్రిమోనియల్ సైట్లలో ఉండే ప్రొఫైల్స్ చూసి అవతలి వారిని నమ్మవద్దని సూచించారు. అపరిచితులతో క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల సమాచారాన్ని పంచుకోవద్దని చెప్పారు.

