Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

Big TV Live 1 week ago

Fake DAP: నాగర్‌కర్నూల్ జిల్లాలో అమాయక రైతులను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్న ఓ నకిలీ ఎరువుల విక్రయ ముఠా గుట్టును జిల్లా యంత్రాంగం రట్టు చేసింది.

వ్యవసాయ, పోలీసు అధికారుల సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా నకిలీ డీఏపీ ఎరువుల బస్తాలు బయటపడ్డాయి. రైతుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు యత్నించిన వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

మండలాల్లో మెరుపు దాడులు..

జిల్లా వ్యాప్తంగా బిజినపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, కల్వకుర్తి మండలాల్లో అధికారులు ఒక్కసారిగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మార్కెట్లో మంచి పేరున్న ప్రముఖ ఎరువుల కంపెనీల లేబుళ్లను అతికించి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన మొత్తం 872 నకిలీ డీఏపీ సంచులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపించగా, వాటిలో ఉండాల్సిన నత్రజని, భాస్వరం మోతాదులు సరిగ్గా లేవని తేలింది. దీంతో స్వాధీనం చేసుకున్న స్టాక్‌ను అధికారులు నాన్-స్టాండర్డ్, నకిలీ ఎరువులుగా అధికారికంగా ధృవీకరించారు.

ఏడుగురి అరెస్ట్..

ఈ అక్రమ రవాణాలో మొత్తం 9 మంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితులపై భారతీయ నశిత్ సంహిత , ట్రేడ్ మార్క్స్ చట్టం, ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు , నిత్యావసర వస్తువుల చట్టం కింద కఠిన కేసులు నమోదు చేశారు.

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సూచన

ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ రైతులకు కీలక సూచనలు చేశారు. నకిలీ ఎరువులు కొని మోసపోవద్దని, కేవలం ప్రభుత్వం గుర్తించిన లైసెన్స్ పొందిన డీలర్ల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ప్రతిసారీ తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, నకిలీ ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live