Odela Universe: శ్రీకాంత్ ఓదెల..'దసరా'తో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్. మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి, తన మార్కు ఊరమాస్ మేకింగ్‌తో ఇండస్ట్రీని ఆకర్షించిన ఆయన, ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో తన రెండో ప్రాజెక్ట్ 'పారడైజ్'ను సెట్స్ మీద పెట్టేసాడు..
సుధాకర్ చెరుకూరి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలను పెంచేసుకుంది.అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఒక క్రేజీ గాసిప్ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. యస్ ..శ్రీకాంత్ ఓదెల కేవలం ఒక సినిమా చేయడం లేదు, ఆయన టాలీవుడ్‌లోనే అత్యంత భారీ ‘సినిమాటిక్ యూనివర్స్’కు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.
‘పారడైజ్’కు, చిరంజీవి సినిమాకు మధ్య ఇంటర్‌లింక్
నాని ‘పారడైజ్’ పూర్తి కాకముందే, శ్రీకాంత్ ఓదెల తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ మెగా ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే, నాని ‘పారడైజ్’ కథకు, చిరంజీవి సినిమాకు మధ్య బలమైన ఇంటర్‌లింక్ ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. హాలీవుడ్‌లో మార్వెల్ స్టూడియోస్, కోలీవుడ్‌లో లోకేష్ కనగరాజ్ (LCU) తరహాలో శ్రీకాంత్ ఓదెల కూడా ఒక సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘పారడైజ్’లో కనిపించే కొన్ని కీలక సంఘటనలు, పాత్రలు చిరంజీవి సినిమాలో ఇంకాస్త పవర్‌ఫుల్‌గా కనిపించనున్నాయట.
‘ క్లైమాక్స్‌లో మెగాస్టార్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్
ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఇండస్ట్రీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ లీకైంది. ‘పారడైజ్’ క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో మెరవబోతున్నారని, ఇందుకోసం దర్శకుడు ఇప్పటికే చిరంజీవిని సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. థియేటర్లలో నాని సినిమా ముగిసే సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇస్తే, ఆ మాస్ జాతర ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడానికే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ద్వారానే చిరంజీవి తదుపరి సినిమాకు సంబంధించిన లీడ్ లేదా హింట్ ఇవ్వబోతున్నారట. అంటే ‘పారడైజ్’ ముగింపు, మెగాస్టార్ సినిమాకు బలమైన పునాది కానుందన్న మాట.
ఈ సినిమాటిక్ యూనివర్స్‌కు ఒక ప్రీక్వెల్ కూడా
ఇంతటితో ఈ క్రేజీ ప్లాన్ ముగిసిపోలేదండోయ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాటిక్ యూనివర్స్‌కు ఒక ప్రీక్వెల్ కూడా లైన్‌లో ఉందట. ప్రస్తుతం నానితో తీస్తున్న ‘పారడైజ్’ కథ అనేది ఈ ముగ్గురు కలిసే వరల్డ్ లో మధ్య భాగం అని, దీనికంటే ముందు జరిగిన సంఘటనలను వివరిస్తూ ఒక ప్రీక్వెల్ సినిమా రాబోతోందని అంటున్నారు. ఆ ప్రీక్వెల్ తర్వాత ‘పారడైజ్’, ఆ తర్వాత కథను ముగించేలా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉండబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఒకవేళ ఇదే నిజమైతే, టాలీవుడ్‌లో మూడు భాగాల భారీ మల్టీస్టారర్ యూనివర్స్‌ను ప్లాన్ చేసిన మొదటి దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల చరిత్ర సృష్టిస్తారనడంలో సందేహం లేదు.
ఈ గాసిప్స్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో
గతంలో ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’తో, లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’తో ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల సైతం అదే బాటలో పయనిస్తూ, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో నాని, చిరంజీవి వంటి స్టార్స్‌ను ఒకే యూనివర్స్ లోకి తీసుకురావడం నిజంగా టాలీవుడ్‌లోనే పెద్ద రిస్క్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నప్పటికీ మూవీ టీమ్ నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. కానీ ‘దసరా’ లాంటి రా అండ్ రస్టిక్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల విజన్ మీద అభిమానులకు గట్టి నమ్మకమే ఉంది.చూడాలి మరి తెగ చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్స్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !
also read :ఆడదాని కడుపుకోత శాపం తగులుతుంది.. ముఖ్యమంత్రి విజయ్‌పై కోలీవుడ్ నటి కామెంట్స్ వైరల్

