తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న అభ్యర్థులకు త్వరలోనే ఒక శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో భవిష్యత్తులో వెలువడనున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్ల పాటు సడలించాలని ప్రభుత్వానికి విన్నపాలు అందాయి.
ఈ అంశంపై పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ కోదండరాం.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ చొరవ తీసుకున్నారు. వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను విడివిడిగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో సుమారు పదేళ్ల పాటు ఎటువంటి ఉద్యోగ నియామకాలు జరగలేదని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సుదీర్ఘ 20 ఏళ్ల కాలంలో సరైన నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి ఉండాల్సిన అర్హత వయస్సును దాటిపోయారని వారు ముఖ్యమంత్రికి వివరించారు.
నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల నష్టపోయిన యువతకు ఈ ప్రభుత్వం అండగా నిలవాలని వారు విన్నవించారు. వయోపరిమితిని పదేళ్ల పాటు పెంచడం ద్వారా అర్హత కోల్పోయిన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పోటీ పరీక్షలు రాసేందుకు అవకాశం లభిస్తుందని వారు తెలిపారు.
ఈ ప్రతిపాదనల పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలత వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై నేతలతో ఆయన లోతుగా చర్చించారు. వయోపరిమితి సడలింపు వల్ల చేకూరే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతిగా ఉంటుందని.. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.
రాబోయే నోటిఫికేషన్లలో ఈ సడలింపు అమలైతే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఊరట లభించనుంది. దీనిపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు.. టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే!

