Sand Mafia: స్వేచ్ఛ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పోలీసులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను పట్టుకున్న తమకున్న అవకాశాలు చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకొని కఠిన చర్యలు తీసుకోవడం లేదు.
ఉమ్మడి జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంత తీర గ్రామాలతో పాటు తుంగభద్ర నదితో పాటు దుందుభి నది పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. పోలీసులు చట్టాన్ని కఠినంగా అమలు చేయకపోవడంతో ప్రకృతి సంపద దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.
పలుమార్లు పట్టుబడుతున్నా
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు తరచూ పట్టుబడుతున్న కొందరు పోలీసు అధికారులు మామూలు తీసుకుంటూ వాహనాన్ని కోర్టుకు కాకుండా తహసిల్దార్, మైనింగ్ అధికారులకు పంపిస్తున్నారు. మూడోసారి పట్టుబడినట్లు పేర్కొంటే, సీజ్ చేసే అవకాశం ఉంటుందని మొదటిసారి దొరికినట్లుగా రికార్డ్ రాస్తున్నారు. దీంతో అక్రమ రవాణా దారులు అమామ్యాలు సమర్పించుకుంటూ రాత్రి, పగలు అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. అక్రమార్కులను కాపాడేందుకు ఖద్దర్ నాయకుల జోక్యం సైతం అధికంగా ఉంటోంది.
తహశీల్దార్, మైనింగ్ శాఖకు పంపితే..
పట్టుబడిన ఇసుక అక్రమ రవాణా వాహనాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి తహసిల్దార్, మైనింగ్ అధికారుల చర్యలకు పంపినట్లయితే మొదటి రెండు అక్రమ రవాణాకు జరిమానాలు విధిస్తారు. ఇసుకను తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఇసుకను డంపు చేసి సంబంధిత అధికారి విధించిన జరిమాన చెల్లించిన తర్వాత ట్రాక్టర్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ట్రాక్టర్ తక్కువ సమయంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
Also read: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!
కోర్టులో హాజరు పరిస్తే
అనుమతులు లేకుండా ఏ వాహనమైన ఇసుక రవాణ చేస్తే చట్ట ప్రకారం ఇలా వాహనం పోలీసులకు పట్టుబడితే బి.ఎన్.ఎస్ 303 (2),21(4) ఏం ఏం డి ఆర్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నారు. నిందితుడు ఎక్కువసార్లు ఇసుక అక్రమ రవాణా చేస్తే పీజీసీపీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిస్తే కోర్టు సూచనల మేరకు తహసశీల్దార్ కార్యాలయంలో పోయించి కోర్టు ద్వారా వాహనాన్ని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ట్రాక్టర్ విడుదల కావాలంటే సుమారు నెలరోజుల సమయం పడుతుంది.
జరిమానాలు ఇలా..
వాహనం. మొదటిసారి రెండోసారి
ట్రాక్టర్ 5000 15000
పది టన్నుల బరువు లారీ 50,000, లక్ష రూపాయలు
10 టన్నులకు పైగా బరువు యంత్రాలు 50 వేలు, లక్ష
మూడోసారి పట్టుబడితే వాహనం యంత్రాన్ని సీజ్ చేసి వేలం వేసే అవకాశాలు ఉంటాయి.

