Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పల్సర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. N125 ఉత్పత్తి నిలిపివేత!

పల్సర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. N125 ఉత్పత్తి నిలిపివేత!

Big TV Live 3 weeks ago

పాపులర్ టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో సంచలన నిర్ణయం తీసుకుంది. మోస్ట్ పాపులర్ మోడల్ పల్సర్ N125 ఉత్పత్తిని నిలిపివేసింది. కంపెనీ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా, డీలర్ల సమాచారం ప్రకారం ఈ బైక్ సరఫరా కొద్ది నెలల క్రితమే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

పల్సర్ N125 భవిష్యత్తుపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.

కొన్ని నెలల నుంచి పల్సర్ 125 ఉత్పత్తి నిలిపివేత

దేశవ్యాప్తంగా పలువురు డీలర్లకు గత కొన్ని నెలలుగా పల్సర్ N125 కొత్త స్టాక్ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసిందనే వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఈ బైక్ బజాజ్ అధికారిక వెబ్‌ సైట్‌ లో ఇంకా కనిపిస్తోంది. అయినప్పటికీ, త్వరలోనే దానిని వెబ్‌ సైట్ నుంచి తొలగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఉత్పత్తి ఎందుకు నిలిపివేశారంటే?

పల్సర్ N125 నిలిపివేతకు ప్రధాన కారణంగా తక్కువ అమ్మకాలని చెబుతున్నారు. మార్కెట్లో ఈ బైక్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోతుందని కంపెనీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 125సీసీ సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువగా ఉండటంతో పాటు, కొనుగోలుదారుల అంచనాలను ఈ మోడల్ పూర్తిగా అందుకోలేకపోయిందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. పల్సర్ బ్రాండ్ అంటే సాధారణంగా పవర్ ఫుల్ డిజైన్, మస్క్యులర్ లుక్, స్పోర్టీ స్టైల్ గుర్తుకు వస్తాయి. చాలా సంవత్సరాలుగా ఈ బ్రాండ్ అదే ఇమేజ్‌ ను కొనసాగిస్తూ వచ్చింది.

అయితే, పల్సర్ N125 మాత్రం ఇతర పల్సర్ మోడళ్లతో పోలిస్తే కొంచెం స్లిమ్‌ గా, కాంపాక్ట్ డిజైన్‌ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ డిజైన్ చాలామంది పల్సర్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీమియం 125సీసీ బైక్ కొనాలనుకునే కస్టమర్లు స్టైల్‌ తో పాటు పవర్‌ ఫుల్ లుక్‌ ను ఆశిస్తారు. అయితే, N125 డిజైన్ పల్సర్ బ్రాండ్‌ కు ఉన్న ప్రత్యేక గుర్తింపుకు కొంత భిన్నంగా ఉండటంతో అమ్మకాలపై ప్రభావం పడిందని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.

కొత్త అప్ డేట్ తో మార్కెట్ లోకి వస్తుందా?

ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. ఈ మోడల్ కథ ఇక్కడితో ముగిసిందని చెప్పలేం. గతంలో కూడా బజాజ్ కొన్ని మోడళ్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసి, తర్వాత చిన్న మార్పులతో, కొత్త అప్‌ డేట్లతో తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల పల్సర్ N125 కూడా భవిష్యత్తులో కొత్త డిజైన్ లేదంటే కొత్త ఫీచర్లతో మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై స్పష్టత రావాలంటే కంపెనీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

కొత్త కలర్స్‌ తో క్రేజీగా ఏథర్ 450X.. ఛార్జింగ్ కూడా ఇక సూపర్ ఫాస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live