Dailyhunt
పశ్చిమాసియాలో యుద్ధం క్లైమాక్స్? ఇరాన్ 3 కండీషన్లు.. ట్రంప్ ఓకే అంటారా?

పశ్చిమాసియాలో యుద్ధం క్లైమాక్స్? ఇరాన్ 3 కండీషన్లు.. ట్రంప్ ఓకే అంటారా?

Big TV Live 2 weeks ago

Iran US War: పశ్చిమాసియాలో రెండు నెలలుగా రగులుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. గత ఫిబ్రవరి 28న మొదలైన ఈ ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి.

అయితే, కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, చర్చల ప్రయత్నాలు, ఇరాన్ ప్రతిపాదనలు, ట్రంప్ ఆఫర్లు చూస్తుంటే.. యుద్ధానికి అతి త్వరలోనే ఎండ్ కార్డ్ పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ కొత్త డిమాండ్లు

మొదట్లో రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత.. శాంతి స్థాపన కోసం 10 పాయింట్ల ప్రతిపాదనని ఇరాన్ ముందుంచింది అమెరికా. దీనిని తిరస్కరించిన ఇరాన్.. తమ సొంత నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని కోరుతోంది. ఈ క్రమంలో.. అమెరికా-ఇరాన్ మలి విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ.. కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయ్. యుద్ధం ముగింపు, హర్మూజ్ క్లియరెన్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ చుట్టూ.. ఇవన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. అమెరికాతో మళ్లీ శాంతి చర్చలు మొదలవ్వాలంటే.. ముందుగా వారు పూర్తి చేయాల్సినవి ఇవేనని.. ఇరాన్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తెలియజేసింది.

ఇరాన్ కొత్త రోడ్‌మ్యాప్

అమెరికా ముందుగా యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటోంది ఇరాన్. అంతేకాదు.. ఇరాన్, లెబనాన్‌పై మళ్లీ దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలంటున్నారు. తొలి దశలోని డిమాండ్లకు అంగీకారం కుదిరితే, రెండో దశలో కీలకమైన హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరు పక్షాలు చర్చలు మొదలవుతాయ్. ఇక.. ఈ రెండు దశలు దాటాకే.. ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూపై చర్చించేందుకు ముందుకొస్తుంది. ఇదే.. కీలకమైన అంశం.

హర్మూజ్ తెరవడంపై ట్విస్ట్

ఎందుకంటే, టెహ్రాన్ యురేనియం శుద్ధిని నిలిపివేసి, ఆ నిల్వలను దేశం నుంచి తరలించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. వీటన్నింటినికి అమెరికా ఒప్పుకుంటేనే.. హర్మూజ్ జలసంధిని తెరుస్తామని, నౌకల ప్రయాణాలకు అనుమతులిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. హర్మూజ్ తెరిచేందుకు కూడా ఇరాన్ ఓ కండీషన్ పెట్టింది. హర్మూజ్‌లో యూఎస్ నేవీ దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తేయాలని తెలిపింది. ఇరాన్ ప్రతిపాదనలపై.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు.

ఇరాన్ ప్రతిపాదనలపై ట్రంప్ స్పష్టం..

ఇరాన్ ప్రపోజల్స్ గతంతో పోలిస్తే కాస్త బెటర్‌గా ఉన్నాయని చెప్పారు. అయితే, ఒప్పందం కుదుర్చుకునేందుకు.. ఇవి సరిపోవని చెప్పడం మళ్లీ అనిశ్చితికి దారితీసింది. అంతేకాదు.. అమెరికా వర్గాలు కూడా రియాక్ట్ అయ్యాయ్. సున్నితమైన దౌత్యపరమైన చర్చలు, అమెరికా పత్రికల ద్వారా జరపదన్నారు. ట్రంప్ చెప్పినట్లు.. అధికారం అమెరికా చేతిలోనే ఉందని, అమెరికా ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే ఒప్పందాన్ని మాత్రమే కుదుర్చుకుంటుందని తెలిపాయ్. అంతేకాదు.. ఇరాన్‌కు అణ్వాయుధాన్ని దక్కనివ్వమంటున్నారు.

ఇరాన్ ప్రతిపాదనలపై ట్రంప్ పాజిటివ్ టోన్

ఇరాన్ పట్ల కఠినంగా ఉండే ట్రంప్.. ఈసారి కొంత భిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ ప్రతిపాదనలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పడం.. అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. చర్చలు కొలిక్కి వచ్చే దాకా సీజ్ ఫైర్ కొనసాగుతుందని ప్రకటించారు. యుద్ధాన్ని పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని ఆయన భావిస్తున్నారు. కాకపోతే.. హర్మూజ్ దిగ్బంధనం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయ్.

ట్రంప్‌కు డబుల్ ఛాలెంజ్

నవంబర్‌లో జరగనున్న అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల దృష్ట్యా, ధరలను తగ్గించాలంటే.. యుద్ధం ఆపడం ట్రంప్‌కి అనివార్యంగా మారింది. అయితే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో ట్రంప్ పట్టువీడటం లేదు. మిగతా అంశాలకు ఓకే చెప్పే అవకాశం ఉన్నా.. యురేనియం శుద్ధి నిలిపివేతపై క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు. యుద్ధం ముగిసేందుకు పరిస్థితులు సానుకూలంగానే కనిపిస్తున్నా.. కొన్ని అడ్డంకులు మాత్రం ఇంకా తొలగలేదు. ఇరాన్ తన అణు ప్రోగ్రామ్‌ నుంచి పూర్తిగా తప్పుకోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. పైగా.. అమెరికా-ఇరాన్ మధ్య డీల్ కుదిరితే.. ఇజ్రాయెల్ దానిని ఒప్పుకుంటుందా? అనేది క్వశ్చన్ మార్క్.

హర్మూజ్ వద్ద హై టెన్షన్

ఇప్పటికే.. అమెరికా-ఇరాన్ మధ్య రెండు విడతల్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్‌లో సున్నితమైన కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం.. రెండు నెలలవుతున్నా ఆఖరి అంకానికి చేరే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో.. ఇరాన్ ప్రతిపాదనలకు అమెరికా ఓకే చెబుతుందా? షాకే ఇస్తుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతానికి కాల్పులు ఆగినా.. హర్మూజ్ దగ్గర అమెరికా నేవీ దళాల దిగ్బంధనం, ఇరాన్ ప్రతిఘటన కొనసాగుతూనే ఉన్నాయ్. ఇది.. మళ్లీ ఎప్పుడైనా హింసకు దారితీసే అవకాశం ఉందనే ఆందోళనలు కనిపిస్తున్నాయ్.

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు..

పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధజ్వాలలు.. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్నాయి. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్యలో భారత్ లాంటి దేశాలెన్నో నలిగిపోతున్నాయ్. యుద్ధం ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? ఎవరి ఆధిపత్యాన్ని ప్రపంచానికి చూపిస్తుందనేది పక్కనపెడితే.. దాని సెగ మాత్రం మిగతా దేశాల్లోనూ సామాన్యులకు తగులుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, మలి దశ చర్చలు కూడా విఫలమైతే తలెత్తే పరిణామాలను తలచుకుంటే.. వణుకు పుడుతోంది. యుద్ధం మన సరిహద్దుల్లో కాకపోయినా, అనేక దేశాల ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు.. పశ్చిమాసియాతో ముడిపడి ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతాయ్.

ప్రపంచానికి కొత్త ముప్పు

ప్రస్తుతం.. మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయ్. ఇవి గనక ఇప్పట్లో కొలిక్కి రాకపోతే.. యుద్ధం కేవలం ఇరాన్-ఇజ్రాయెల్‌కే పరిమితమయ్యే అవకాశం లేదు. లెబనాన్, సిరియా, యెమెన్ లాంటి దేశాలకు కూడా పాకుతుంది. ఇది.. మిగతా అగ్ర ఆర్థిక వ్యవస్థల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయొచ్చు. అంతేకాదు.. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేసే ప్రమాదం ఉంది. ఇది.. ప్రపంచ శాంతికి తీరని ముప్పులా మారుతుంది. మిగతా దేశాలు కూడా దౌత్యపరంగా అనేక ఒత్తిడిని, పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్.. ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. అటు ఇరాన్‌తో చాబహార్ పోర్ట్ లాంటి కీలక ప్రాజెక్టులను కలిగి ఉంది. యుద్ధం ముదిరితే.. ఏ పక్షం వహించాలో తేల్చుకోలేక.. భారత్ దౌత్యపరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అమెరికా, ఇరాన్ మెుండితనం..

ఇప్పటికే.. ఇది యుద్ధాల యుగం కాదు.. వీలైనంత త్వరగా వార్‌ని ముగించాలని ప్రపంచ దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ తన మొండి వైఖరిని వీడి, ఇరాన్ తన పంతాన్ని పక్కన పెడితేనే ప్రపంచానికి మేలు జరుగుతుంది. అలాకాకుండా.. చర్చలు విఫలమైనా, ఇరాన్ ప్రతిపాదనలకు అమెరికా పట్టించుకోకుండా.. తాము చెప్పిందానికే ఇరాన్ కట్టుబడి ఉండాలని పట్టుబట్టినా.. ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నాయ్. అప్పుడు.. వార్ ఎఫెక్ట్ కేవలం ఆయుధాలు పట్టిన సైనికుల మీదే కాదు. వేల మైళ్ల దూరంలో ఉన్న సామాన్య భారతీయుడి బతుకుబండి పైనా పడుతుంది. అందుకోసమే.. పశ్చిమాసియాతో పాటు ఆసియాలోని చాలా దేశాలు.. ఈ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోవాలని బలంగా కోరుకుంటున్నాయ్.

పుతిన్‌తో కీలక భేటీ..

గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం తీవ్రమైతే వారి భద్రత ప్రశ్నార్థకమవుతుంది. మరోవైపు.. కొత్త ప్రతిపాదనలపై రష్యా మద్దతు కూడగట్టేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ పుతిన్‌తోనూ భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో శాంతి కోసం రష్యా కృషి చేస్తుందని చెప్పారు. ఇదే సమయంలో.. మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయ్. అమెరికా ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్న పాక్‌ సరైన మధ్యవర్తి కాదని ఇరాన్‌ ఎంపీ ఇబ్రహీం రెజాయీ అన్నారు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్థాన్‌కు లేదని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు, లెబనాన్‌ విషయంలో అమెరికా తన డిమాండ్లు ముందుంచినప్పుడు.. పాక్ అడ్డు చెప్పలేదని, మధ్యవర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. కాస్త గట్టిగానే కడిగిపారేశారు.

సీజ్ ఫైర్ కొనసాగుతోందా..

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఇప్పుడు నో వార్-నో డీల్ అనే స్థితిలో ఉంది. ఇరాన్ తమ డిమాండ్లకు ఒప్పుకుంటే తప్ప.. యుద్ధానికి ముంగిపు పలకబోమనే విధంగా ట్రంప్ ఉన్నారు. ఇరాన్ కూడా తన ఆర్థిక వ్యవస్థని కాపాడుకునేందుకు.. ఆంక్షల తొలగింపుని అత్యవసరంగా భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. ఇరాన్ ప్రతిపాదనలకు అమెరికా ఒప్పుకొని, చర్చలు సఫలమైతే.. ప్రపంచం మరో భారీ సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది. లేకపోతే.. ఇంకొన్నాళ్ల పాటు ఈ పరిస్థితులు తప్పవంటున్నారు. ప్రస్తుతానికి.. సీజ్ ఫైర్ కొనసాగుతోంది. అదే.. శాశ్వత శాంతిలా మారేలా కావాలని ప్రపంచం కోరుకుంటోంది.

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. ఆల్ రికార్డ్స్ బ్రేక్!

Story by: Anup, Big Tv

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live