Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రో ధరల పెంపు..  ప్రయాణికులను ఆకర్షించేందుకు మెట్రో క్రేజీ ప్లాన్!

పెట్రో ధరల పెంపు.. ప్రయాణికులను ఆకర్షించేందుకు మెట్రో క్రేజీ ప్లాన్!

Big TV Live 1 hr ago

Metro Run Additional Trips:కార్లు, బైకుల వినియోగాన్ని తగ్గించి, ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఉపయోగించేలా మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రతి సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అదనపు మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించింది. మెట్రో మండేస్ పేరుతో ఈ అదనపు రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. ప్రస్తుతం సోమవారాల్లో ఆరు అదనపు రైళ్లు నడపనున్నారు. దీంతో మొత్తం 24 అదనపు ట్రిప్‌లు అందుబాటులోకి వస్తాయి. అయితే, ఈ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో కాదు.. ఢిల్లీ మెట్రో.

సీఎం రేఖా గుప్తా నిర్ణయంతో అదనపు మెట్రో సర్వీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇచ్చిన పిలుపుతో మెట్రో మండేస్ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైలు అధికారులు తెలిపారు. ప్రజలు తమ వ్యక్తిగత కార్లు, బైకులపై కాకుండా మెట్రోలో ప్రయాణించాలనే ఉద్దేశంతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. సోమవారాల్లో సాధారణంగా కార్యాలయాలు, విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ అదనపు సర్వీసులు ఉపయోగపడతాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ భావిస్తోంది.

ఏ మార్గంలో ఎన్ని అదనపు రైళ్లు నడుస్తాయంటే?

రెడ్, యెల్లో, బ్లూ, పింక్ లైన్లలో ఒక్కో అదనపు రైలు నడపనుండగా, వైలెట్ లైన్‌ లో రెండు అదనపు రైళ్లు అందుబాటులో ఉంటాయి. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఈ సర్వీసులను ఇతర రోజులకు కూడా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.అటు మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే మయూర్ విహార్ ఫేజ్-1, హౌజ్ ఖాస్ వంటి స్టేషన్లలో అదనపు భద్రతా సిబ్బందిని నియమిస్తున్నారు. అలాగే టికెట్ కౌంటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు. భద్రతా తనిఖీల దగ్గర ఎక్కువ సేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పెట్రో ధరల పెంపుతో మెట్రో కీలక నిర్ణయం

ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతోప్రజలను మెట్రో వైపు మళ్లించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90లోపే ఉండగా, ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రూ.95 నుంచి రూ.100 వరకు ఉంది. డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రతిరోజూ కార్లు, బైకులు ఉపయోగించే వారికి అదనపు భారం అవుతోంది. ఈ పరిస్థితుల్లో మెట్రో వంటి ప్రజా రవాణా వాడితే ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా వేగంగా ప్రయాణించవచ్చు అంటున్నారు. పర్యావరణ పరంగా కూడా మెట్రో ప్రయాణాలు మంచివని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఇప్పటికే పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం అవసరమంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live