Side effects of cooler: మండుతున్న వేసవి ఎండల నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఎయిర్ కూలర్ చాలా బాగా ఉపయోగించవచ్చు. అయితే.. కూలర్ గాలి ప్రకృతి సిద్ధంగా అనిపించినప్పటికీ, అది పిల్లల ఆరోగ్యానికి కొన్ని సార్లు ప్రతి కూలంగా మారుతుంది.
ముఖ్యంగా సరిగ్గా నిర్వహించని కూలర్ల వల్ల వచ్చే తేమతో కూడిన గాలి పిల్లల్లో శ్వాసకోశ సమస్యలకు, చర్మ వ్యాధులకు దారి తీయవచ్చు. కూలర్ గాలి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ? పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచాలో వివరంగా తెలుసుకుందాం.
వేసవి కాలం రాగానే ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతుంటారు. గదిని చల్లబరచడానికి.. ఇది మంచి మార్గమే అయినప్పటికీ.. పసిపిల్లలు , పెరుగుతున్న పిల్లల విషయంలో కూలర్ వాడకంపై కొన్ని అపోహలు, మరికొన్ని ఆందోళనలు ఉన్నాయి. కూలర్ గాలి వల్ల పిల్లలకు కలిగే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇవే..
1. శ్వాసకోశ సమస్యలు :
కూలర్లు నీటిని ఆవిరి చేయడం ద్వారా చల్లటి గాలిని ఇస్తాయి. దీని వల్ల గాలిలో తేమ శాతం విపరీతంగా పెరుగుతుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. ఇది పిల్లల్లో జలుబు, దగ్గు, ఆస్తమా , సైనసైటిస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా కూలర్ ప్యాడ్లలో పేరుకుపోయే దుమ్ము, ధూళి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
2. చర్మ వ్యాధులు , అలర్జీలు:
కూలర్ గాలి వల్ల గదిలో తేమ పెరగడం వల్ల చర్మంపై చెమట సరిగ్గా ఆవిరి కాదు. దీని వల్ల పిల్లల్లో గజ్జి, తామర లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే.. కూలర్ నీటిలో దోమలు చేరితే, అవి పిల్లల చర్మంపై దద్దుర్లు , ఇతర అలర్జీలను కలిగిస్తాయి.
3. కండరాల నొప్పులు, బిగుతు:
కూలర్ గాలి నేరుగా పిల్లల మీద పడినప్పుడు, వారి శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. దీని వల్ల తెల్లవారుజామున పిల్లలు కండరాల నొప్పులు లేదా ఒళ్లు నొప్పులతో బాధపడవచ్చు. పసిపిల్లల విషయంలో ఇది వారి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
4. అంటువ్యాధుల ముప్పు:
కూలర్ లోని నీటిని క్రమం తప్పకుండా మార్చకపోతే.. అది నిల్వ ఉండి దోమలకు నిలయంగా మారుతుంది. దీని వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే, కూలర్ ప్యాడ్లపై పెరిగే నాచు వల్ల గాలి కలుషితమై పిల్లలకు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది.
ఆఫీస్‌లో ఏసీ మరీ ఎక్కువైందా? బీపీ పెరుగుతుందట.. తస్మాత్ జాగ్రత్త!
పిల్లల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
నేరుగా గాలి తగలకుండా చూడండి: కూలర్ గాలి నేరుగా పిల్లల శరీరంపై పడకుండా.. గదిలో గాలి సర్క్యులేట్ అయ్యేలా చూసుకోవాలి.
వెంటిలేషన్ ముఖ్యం:కూలర్ ఆన్ చేసినప్పుడు గది కిటికీ లేదా తలుపు కొద్దిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల గదిలో తేమ పేరుకుపోదు.
నీటిని మార్చడం:ప్రతి రెండు రోజులకు ఒకసారి కూలర్ లోని నీటిని తీసివేసి శుభ్రం చేయాలి. నీటిలో కొద్దిగా వేప నూనె లేదా క్రిమిసంహారకాలు కలపడం మంచిది.
క్లీనింగ్: కూలర్ ప్యాడ్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. పాతబడిపోయిన ప్యాడ్లను మార్చడం మంచిది.
రాత్రి వేళలో:రాత్రి పూట వాతావరణం చల్లబడినప్పుడు కూలర్ వాడకం తగ్గించాలి లేదా ఫ్యాన్ మోడ్ లో ఉంచాలి.
కూలర్ గాలి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సరైన జాగ్రత్తలు పాటిస్తే పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. గాలి నాణ్యతను కాపాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వేసవిలో పిల్లలను ఆరోగ్యంగా ఉంచవచ్చు.

