Dailyhunt
పోటాపోటీ సభలు.. ఎవరికి మైలేజీ.. ఎవరికి డ్యామేజీ!? నయా ట్రెండ్ రాజకీయాలు!

పోటాపోటీ సభలు.. ఎవరికి మైలేజీ.. ఎవరికి డ్యామేజీ!? నయా ట్రెండ్ రాజకీయాలు!

Big TV Live 5 days ago

కేసీఆర్ బయటకు రాకపోతే.. రాలేదంటరు! వచ్చి మీటింగులు పెడితే.. అదే రోజు మేమూ పెడతాం..తుక్కు తుక్కు తిడతామంటరు! దీని వల్ల బీఆరెస్‌కు లాభమా? కాంగ్రెస్‌కు మైలేజీనా?

ఎందుకు ఇలా కాంగ్రెస్ పోటీలు పడి మరీ బీఆరెస్ కు సమానంగా సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తోంది? ఇప్పుడిదే డిస్కషన్ తెలంగాణ స్టేట్ రాజకీయాల్లో. కేసీఆర్ మొన్న జగిత్యాలలో బహిరంగ సభ పెట్టిండు. అదే రోజు సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ టూర్‌, బహిరంగ సభ ప్లాన్ చేసిండు.

అక్కడ సీఎం మాట్లాడుతుంటే.. అక్కడ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతుండు. ఎవరిని చూడాలె? ఏ చానెల్ మార్చాలె? జనానికి పిచ్చెక్కిపోయింది. చివరకు కేసీఆర్ మాటలే ఎక్కువిన్నరు. సహజమే కదా! ఉద్యమ నాయకుడు. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన సీఎం. సీనియర్ నేత. అందులోనూ లేక లేక బయటకొచ్చిండు. ఏం మాట్లాడుతాడో వినాలని అందరికీ ఉంటది. రైతుబంధు సక్కగ పడ్తలేదు. పింఛన్లు పెంచలేదు. ఇంకా చాలా హామీలే ఉన్నయి. అవన్నీ కేసీఆర్ అంటే ..వినాలని ఉంది జనాలకు. అధికారంలో ఉన్నవాళ్లకు సురుకులు పెడితే.. మాకే లాభం జరుగుతదని భావిస్తరు జనం మాములుగా. అదే జరిగింది ఆనాడు. కేసీఆర్‌ను ఎంతగా తుక్కు తుక్కు తిట్టినా జనానికి పట్టదు.

ఏమయ్యా పింఛన్ ఇంకా పెంచలే..! అని అడిగితే.. అబ్బ గట్లడుగు కేసీఆర్‌..! అనే అంటరు. ఇంతోటి దానికి పోటీకి మీటింగు పెట్టి లాభమేమి? డ్యామేజీ తప్ప. మొన్నటికి మొన్న వాళ్లమో ప్లీనరీ వేడుకలని తెలంగాణ భవన్‌లో మీటింగు పెట్టుకున్నరు. ఈడ సీఎం.. సీఎల్పీలో మీడియాతో చిట్ చాట్ పెట్టుకునే.. అక్కడేమంటుండు..? ఇగో నా కౌంటర్ రాసుకోర్రి. ఆయనేం తిట్టిండు? ఇగో నా డబుల్ తిట్లు… మంచిగా రాయిర్రు…! గివే ముచ్చట్లు జరుగుతున్నయి. ఇక ఇప్పుడు గా గులాబీ పార్టోళ్లు.. వరంగల్‌ల రైతు సభ పెడ్తుండ్రు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అక్కడ్నే రైతు డిక్లరేషన్లను ప్రకటించింది. రైతులకు మీరు ప్రకటించిన డిక్లరేషన్లు ఏవీ అమలు కావడం లేదు.. వాళ్లంతా పుట్టెడు గోస పడ్తున్నరని నిలదీసేందుకు గీ సభ పెడ్తురన్నట్టు.

ఇగేముంది? వెంటనే సర్కారోళ్లు కూడా దిగనే దిగిండ్రు. మేము సుక వరంగళ్లనే 5,6,7 తారీఖులల్ల అదే చోట రాయితీపై ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నట్టు పొంగులేటి ప్రకటించిండు. అంటే ఆ సభ రోజే.. మేమూ పెడతం. మీరు మమ్మల్ని తిడితే మేము మిమ్మల్ని అర్సుకుంటం. పదేళ్లలో మీరేం చేసిండ్రు.. రైతులకు బేడీలెయ్యలేదా? గా ముచ్చట్లు గుర్తు చేస్తం. జనం ముందు దోషిలెక్క నెలబెడ్తం అంటున్నరు కాంగ్రెసోళ్లు. కానీ ఏ సభ పెట్టినా.. సర్కార్‌ను ఎన్ని తిట్టినా.. జనం ఆసక్తిగానే చూస్తరు. ఇట్లా తిట్టెటోళ్లు.. నిలదీసెటోళ్లు ఉండాలనే ప్రజలకు కోరుకుంటరు. అట్లుంటెనే ఇంకా జర జల్ది పథకాలు అందుతయి..ఇచ్చిన హామీలు నెరవేరుతయిన్నట్టు.

మీరు ఒక్కమాట సుక వాళ్లతో పడనే పడొద్దు. వాళ్లు అనంగనే జనాల్లో మొత్తం వ్యతిరేకత వచ్చేసిందని భయపడుడెందుకు? సర్కార్ ఏం చేయాల్నో అది చేసుకుంట పోవాలె. ప్రతిపక్షం ఏం అడగాల్నో అది అడుక్కుంట పోతది. ఇప్పుడు మాటలు మాట్లాడేది ప్రతిపక్షమే. చేతల రూపంలో చేసి చూపేది అధికార పక్షమే. అందుకే కాంగ్రెస్‌వి మాటలు తక్కువుండాలె. చేతలు ఎక్కువుండాలె. ఆగ వాళ్లు అడిగేది అడుగుతరు. దానికే ఇట్ల కౌంటర్ మీటింగులు.. ఒకటి తిడితే పది తిడతం అన్నట్టు.. కయ్యానికి కాలు దువ్వే చేష్టల వల్ల పెద్దగా ప్రయోజన ఏమీ లేదు. ఇగ కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఈడ నేనొర్ర.. ఆ నువ్వొర్ర.. జనానికేం అర్థమైతది… ? అన్నట్టుగానే ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live