Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రయాణానికి ముందు ఒంటెలకు ఉప్పు ఎందుకు తినిపిస్తారు? దీని వెనకున్న సైన్స్ ఏంటి?

ప్రయాణానికి ముందు ఒంటెలకు ఉప్పు ఎందుకు తినిపిస్తారు? దీని వెనకున్న సైన్స్ ఏంటి?

Big TV Live 2 weeks ago

Camel Salt: ఏడారి ఓడలుగా ఒంటెలకు పేరుంది. ఇవి ఇతర జంతువులతో పోలిస్తే అద్భుతమైన వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎడారిలో ఉండే తీవ్రమైన ఎండ, నీటి కొరత, శరీరంపై అధిక బరువు వంటి సమస్యలతో పట్టింపు లేకుండా ఇవి రోజుల తరబడి ఇసుక నేలల్లో ప్రయాణించగలవు.

అయితే ఎడారి ప్రాంత ప్రజలు సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్లేముందు ఒంటెలకు పెద్ద మొత్తంలో ఉప్పును తినిపిస్తారని చాలా మందికి తెలియదు. వినడానికి కాస్త వింతగా అనిపించినా.. దీని వెనుక ఒక అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ ఉందంటున్నారు పరిశోధకులు. అదేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఉప్పు ఎందుకు పెడతారంటే?

మామూలుగా మనుషులకు ఉప్పు ఎక్కువైతే దాహం వేసి డీహైడ్రేషన్ బారిన పడతారు. కానీ ఒంటెల విషయంలో ఈ సూత్రం పూర్తి భిన్నంగా పనిచేస్తుంది. ప్రయాణానికి ముందు ఒంటెలకు ఉప్పు తినిపించడం వల్ల అవి ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని తాగుతాయి. ఉప్పు ప్రభావంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒంటెలు తమ శరీర బరువులో మూడో వంతు నీటిని తాగగలవు. ఈ రకంగా ముందే తాగిన నీరు ఎడారిలో మైళ్ల కొద్దీ నడిచేటప్పుడు నీటి కొరత రాకుండా చూస్తుంది. అంతేకాకుండా ఎండ తీవ్రతకు చెమట ద్వారా శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో ఈ ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది.

అద్భుతమైన శరీర నిర్మాణం

మానవులు, ఇతర జీవులతో పోలిస్తే ఒంటె మూత్రపిండాలు ఎంతో సమర్థవంతమైనవి. అవి నీటిని ఏమాత్రం వృథా చేదవు. శరీరంలోని ప్రతి చుక్క నీటిని.. ఉపయోగించుకొని డీహైడ్రేషన్ బారిన పడకుండా ఒంటెలను అవి కాపాడుతుంతాయి. దీని కారణంగానే మిగతా క్షీరదాలు తట్టుకోలేని తీవ్ర డీహైడ్రేషన్ స్థాయిలను కూడా ఒంటెలు సులభంగా తట్టుకోగలుగుతున్నాయి. సాధారణంగా ఒంటెలు తమ వీపుపై ఉండే కుంభంలో (Hump) నీటిని దాచుకుంటాయని ప్రచారం ఉంది. కానీ అది పూర్తిగా అబద్ధం. అక్కడ కేవలం కొవ్వు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆహారం లభించని సమయంలో ఈ కొవ్వు కరిగి ఒంటెకు శక్తిని, నీటిని ఇస్తుంది.

అండాకారంలో రక్త కణాలు..

ఒంటెలకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీటి ఎర్ర రక్త కణాలు గుండ్రంగా కాకుండా అండాకారంలో (Oval shape) ఉంటాయి. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కబడినప్పటికీ రక్తప్రసరణలో ఎలాంటి అడ్డంకులు రావు. వీటికితోడు వీటి నాసికా రంధ్రాలు గాలిలోని తేమను బయటకు పోకుండా ఆపుతాయి, అలాగే వీటి మందమైన కను రెప్పలు బలమైన ఇసుక తుఫానుల నుండి కంటిని కాపాడతాయి.

తరతరాల ఎడారి సాంప్రదాయం

ఇదిలా ఉంటే ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆసియా ప్రాంతాల్లోని ఎడారి తెగలు వందల ఏళ్లుగా ఒంటెలను ఆధారంగా చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రకృతిని, ఒంటెల శరీర తత్వాన్ని తెగల పూర్వీకులు క్షుణ్ణంగా అర్థం చేసుకొని.. తమ తర్వాతి తరాలకు ఆ పరిజ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. మెుత్తంగా చూస్తే.. మైళ్ల కొద్ది ఎడారి ప్రయాణంలో.. ఈ ‘సాల్ట్ థెరపీ’ ఒంటెలకు కొండంత అండగా నిలుస్తోందని చెప్పవచ్చు. మనుషులు డీహైడ్రేషన్ తర్వాత ఎలక్ట్రోలైట్లు తీసుకుంటే.. ఒంటెలు మాత్రం ప్రయాణానికి ముందే ఉప్పుతో రీచార్జ్ అయి ఎడారి ప్రయాణాలకు సిద్ధం కావడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live