ప్రెషర్ కుక్కర్లు వంట సమయాన్ని ఆదా చేస్తాయి. కానీ సరిగ్గా శుభ్రం చేయకపోతే భద్రతా ప్రమాదాలు పెరుగుతాయి. కిచెన్‌లో ప్రెషర్ కుక్కర్ పేలిపోయే ప్రమాదాలు జరుగుతాయి.
ఆహారపదార్థాలు, నూనె, ఆవిరి అయిన తరువాత మిగిలిపోయే అవశేషాలు కుక్కర్ లోపలి భాగాల్లో పేరుకుపోతాయి. ఈ బ్లాకేజీలు ప్రెషర్‌ను పెంచి కుక్కర్ పనితీరును దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల ఈ ప్రమాదకరమైన పరిస్థితులను నివారించవచ్చు.
ప్రెషర్ వాల్వ్‌ను సరిగ్గా శుభ్రం చేయండి
ప్రెషర్ వాల్వ్ అనేది కుక్కర్ లోని అత్యంత ముఖ్యమైన భాగం. ఆవిరి ఈ వాల్వ్ ద్వారా బయటకు వెళ్తుంది. ఆహార అవశేషాలు, నూనె తరచుగా వాల్వ్‌ను బ్లాక్ చేస్తాయి. బ్లాక్ అయిన వాల్వ్ లోపలి ప్రెషర్ ను ప్రమాదకరంగా పెంచుతుంది. ప్రతి నెలా వాల్వ్ ను జాగ్రత్తగా శుభ్రం చేయడం మంచిది. గోరువెచ్చని నీరు, ఒక సన్నని బ్రష్‌ను ఉపయోగించండి. పదునైన వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకండి. లేకపోతే వాల్వ్ దెబ్బతింటుంది.
రబ్బర్ గ్యాస్కెట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయండి
రబ్బర్ గ్యాస్కెట్ వంట సమయంలో కుక్కర్ మూతను గట్టిగా మూసివేస్తుంది. దెబ్బతిన్న లేదా వదులుగా ఉన్న గ్యాస్కెట్ ద్వారా ఆవిరి లీక్ అవుతుంది. దీని వల్ల వంట ఆలస్యం అవుతుంది లేదా సరిగా జరగదు. పైగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి నెలా గ్యాస్కెట్ ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. పగిలిన, గట్టిపడిన లేదా సాగిన గ్యాస్కెట్లను వెంటనే తొలగించే కొత్త వాటిని అమర్చండి. కొద్దిగా సబ్బు, గోరువెచ్చని నీటితో గ్యాస్కెట్‌ను వేరుగా కడగాలి. తిరిగి కుక్కర్‌లో పెట్టే ముందు పూర్తిగా ఆరబెట్టాలి.
కాలిన ఆహారం, నూనె పొరలను తొలగించండి
వంట చేసే సమయంలో కొన్ని సార్లు వంట కాలిపోతుంది. దీంతో కుక్కర్ అడుగు భాగంలో ఆహారం అంటుకుంటుంది. చిక్కటి నూనె పొరలు అంచుల చుట్టూ కూడా పేరుకుపోతాయి. ఈ డిపాజిట్లు వేడి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. డీప్ క్లీనింగ్ కోసం బేకింగ్ సోడా, గోరువెచ్చని నీరు ఉపయోగించండి. మెత్తటి స్పాంజితో మెల్లగా స్క్రబ్ చేయండి. కుక్కర్ హ్యాండిల్స్‌ను కూడా శుభ్రం చేయాలి, ఎందుకంటే అక్కడ నూనె, మురికి సులభంగా చేరుతాయి.
చాణక్య నీతి.. స్త్రీలో ఈ గుణాలుంటేనే ఇంట్లో సుఖ, సంతోషాలు
కుక్కర్‌లో నీరు, లేదా పదార్థాలు ఎక్కువగా నింపకూడదు
కిచెన్‌లో జరిగే ప్రమాదాలు ఎక్కువగా కుక్కర్లలో ఎక్కువగా నింపడం వల్లే జరుగుతాయి. ఎక్కువ ఆహారం ఆవిరి వెంట్లను బ్లాక్ చేస్తుంది. దీంతో బియ్యం, కూరగాయలు వేడి వల్ల పొండి ఎక్కువ స్థలం తీసుకుంటాయి. ఆ తరువాత కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎల్లప్పుడూ కుక్కర్ లోపల తగినంత ఖాళీ స్థలాన్ని వదిలివేయండి.
సేఫ్టీ ఫీచర్లను వంటకు ముందు చెక్ చేయండి
మార్కెట్‌లో కొత్తగా వస్తున్న ప్రెషర్ కుక్కర్లలో అనేక సేఫ్టీ ఏర్పాట్లు ఉంటాయి. సేఫ్టీ ప్లగ్స్, లాకింగ్ సిస్టమ్స్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. కుక్కర్ నుంచి సాధారణంగా లేని శబ్దాలు లేదా ఆవిరి లీకేజీలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. తరుచూ క్లీన్ చేయడం, ఏదైనా చిన్న రిపేర్స్ ఉంటే సమయం ఉండగానే సరిచేస్తే పెద్ద ప్రమాదాలను నివారిస్తాయి. ప్రెషర్ కుక్కర్‌ను ఎప్పుడూ లెవెల్‌గా ఉపరితలంపైనే ఉపయోగించండి. కుక్కర్ నుంచి పూర్తి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాతే మూత తెరవండి.

