Purushah Review : సినిమా థియేటర్ల దగ్గర సందడి కాస్త తగ్గినప్పుడల్లా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు తమ లక్ టెస్ట్ చేసుకుంటాయి .
ఈ క్రమంలోనే పూర్తి వినోదాత్మక కథాంశంతో థియేటర్లలోకి అడుగుపెట్టింది ‘పురుషః’.మరి పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దామా !
కథ
కథ విషయానికి వస్తే, సమాజంలో నిత్యం మనం చూసే సున్నితమైన భార్యాభర్తల బంధాల చుట్టూనే తిరుగుతుంది. చిన్న చిన్న మనస్పర్థలకే కోర్టుల చుట్టూ తిరుగుతూ, విడాకుల వరకు వెళ్తున్న నేటి తరం దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారి సంసారాలను చక్కదిద్దే పాత్రలో హీరో గోవింద్ కనిపిస్తాడు. ఇతరుల సమస్యలను పరిష్కరించే గోవింద్ జీవితంలోనే ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. ఏడేళ్ల పాటు ప్రాణంగా ప్రేమించి, ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న అతని భార్య కమల, ఊహించని విధంగా గోవింద్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడితో ఆగకుండా, గోవింద్ చిన్ననాటి స్నేహితులైన శ్రీను, సత్తి బాబుల జీవితాలు కూడా అదే బాట పడతాయి. వారి భార్యలు కూడా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. అసలు అందరి జీవితాల్లోనూ ఒకేసారి ఈ విడాకుల తుఫాన్ రావడానికి కారణం ఏంటి, గతంలో ‘క్రియేటివ్ కిస్సు’ అనే పాత్ర చేసిన ఒక విచిత్రమైన పని వల్ల వీరి ప్రస్తుత జీవితాలు ఎలా తలకిందులయ్యాయి, అసలు ఈ కథలోకి రోజ్ అనే అమ్మాయి ఎందుకు వచ్చింది వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా.
నటీనటులు
నటీనటుల పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, తొలి సినిమానే అయినా పవన్ కళ్యాణ్ బత్తుల గోవింద్ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా మేన్లీగా కనిపిస్తూనే, డీసెంట్ యాక్టింగ్‌తో మెప్పించాడు. అయితే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లలో అతని లుక్, మేకోవర్, కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అంతగా కుదరలేదనిపిస్తుంది. సినిమాను తన భుజాలపై మోసింది మాత్రం ఖచ్చితంగా కామెడీ గ్యాంగే. సప్తగిరి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, కసిరెడ్డి రాజకుమార్ అంతా పోటీ పడి మరీ నవ్వులు పూయించారు. ముఖ్యంగా పమ్మి సాయికి చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ హిలేరియస్ రోల్ దొరికింది, హరితేజతో కలిసి అతను చేసిన కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ఇక రాజీవ్ కనకాల, మణిచందన తమ అనుభవంతో మెప్పించగా, ‘గుడుంబా శంకర్’ దర్శకుడు వీరశంకర్ చేసిన స్పెషల్ కేమియో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
విశ్లేషణ
దర్శకుడు వీరు ఎంచుకున్న పాయింట్ వినడానికి కొత్తగా అనిపించకపోయినా, గతంలో వచ్చిన ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల ఛాయలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. పాత కథనే తీసుకున్నప్పటికీ, ట్రీట్‌మెంట్ మరియు మేకింగ్ స్టైల్‌ను ప్రెజెంట్ ట్రెండ్‌కి, నేటి జనరేషన్ ఆలోచనలకు తగ్గట్టుగా మార్చడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా ఈ రోజుల్లో ఈగోలు, చిన్నపాటి అపార్ధాల వల్ల ఎలా దూరమవుతున్నారో ప్రాక్టికల్‌గా చూపిస్తూనే, ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్‌టైనింగ్ వేలో స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, సరదా సాగే సన్నివేశాలతో సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభం నుండి క్లైమాక్స్ వరకు వచ్చే కామెడీ ట్రాక్స్ అయితే మరింత హిలేరియస్‌గా అనిపిస్తాయి. అయితే, అంతసేపు నవ్వించిన దర్శకుడు క్లైమాక్స్‌కు వచ్చేసరికి మాత్రం రెగ్యులర్ ఫార్మాట్‌లో ఎమోషనల్ ముగింపు ఇవ్వడం కాస్త సాగతీతగా అనిపిస్తుంది. టెక్నికల్ పరంగా చూస్తే విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కసిరెడ్డి నోట వచ్చే జంప్ టైమింగ్ డైలాగ్స్ థియేటర్లలో పేలాయి. రన్‌టైమ్ కూడా చాలా క్రిస్పీగా, తక్కువగా ఉండటం ఈ సినిమాకి మరో పెద్ద అసెట్.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ
ఫస్ట్ హాఫ్
క్యాస్టింగ్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
క్లైమాక్స్
ఎమోషనల్ ట్రాక్స్
చివరిగా ..
మొత్తంగా చూసుకుంటే, ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాన్‌స్టాప్ కామెడీ, వేగంగా సాగిపోయే ఫస్ట్ హాఫ్, పర్ఫెక్ట్ క్యాస్టింగ్ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను నిలబెట్టాయి. అదే సమయంలో క్లైమాక్స్ ఎపిసోడ్, కాస్త బలవంతంగా చొప్పించినట్టుండే ఎమోషనల్ ట్రాక్స్ మైనస్ పాయింట్లుగా మారాయి. ఎలాంటి అంచనాలు లేకుండా, వీకెండ్‌లో కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి ‘పురుషః’ ఒక మంచి వినోదాత్మక ఛాయిస్ అవుతుందనడంలో సందేహమే లేదు.
Purushah Movie Review And Rating :2.75/5
also read :నేను డ్రింక్ చేస్తాను.. అందులో తప్పేంటి? ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అనసూయ భరద్వాజ్!

