Intermittent Fasting: బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలామంది 16 గంటలు లేదా 14 గంటల పాటు ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) చేస్తుంటారు.
కానీ అందరికీ ఇన్ని గంటలు ఉపవాసం ఉండటం సాధ్యం కాకపోవచ్చు. నిజానికి రాత్రి డిన్నర్‌కి, మరుసటి రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య కేవలం 12 గంటల విరామం ఇచ్చినా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
కఠినమైన నియమాలు అక్కర్లేదు..
శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా బరువు తగ్గడానికి 12 గంటల ఫాస్టింగ్ చాలు. రాత్రి 8 గంటలకు డిన్నర్ ముగించి, ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఇది పాటించడం చాలా తేలిక.
ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి..
మనం ఆహారం తిన్న ప్రతిసారీ శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. రాత్రి వేళల్లో కూడా తింటూ ఉంటే కొవ్వు కరిగే ప్రక్రియ ఆగిపోతుంది. అదే 12 గంటల విరామం ఇవ్వడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గి, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు శక్తిగా మారడానికి అవకాశం లభిస్తుంది.
శరీర గడియారానికి తగ్గట్టుగా..
మన శరీర జీవక్రియలు ప్రకృతి సిద్ధమైన బయలాజికల్ క్లాక్ ప్రకారం పనిచేస్తాయి. రాత్రి త్వరగా తినడం వల్ల ఆహారం సరిగ్గా అరుగుతుంది. ఆలస్యంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, నిద్ర భంగమై బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
రాత్రిపూట స్నాక్స్‌కు చెక్..
చాలామందికి రాత్రి టీవీ చూస్తూ స్నాక్స్, కూల్ డ్రింక్స్ లేదా స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. ఈ 12 గంటల ఉపవాస నియమం పెట్టుకోవడం వల్ల అదనపు కేలరీలు శరీరంలోకి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా పొట్ట ఉబ్బరం, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ చిన్న మార్పును జీవితాంతం సులభంగా కొనసాగించవచ్చు. బరువు తగ్గడమే కాకుండా.. ఇన్సులిన్ పనితీరు మెరుగై, బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అయితే ఉపవాసంతో పాటు సమతుల్యమైన పోషకాహారం తీసుకోవడం, తగినంత నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం.

