Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాత్రికి రాత్రే 83 గ్రామాల ప్రజలు అదృశ్యం.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

రాత్రికి రాత్రే 83 గ్రామాల ప్రజలు అదృశ్యం.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

Big TV Live 2 weeks ago

Kuldhara Village Mystery:రాజస్థాన్‌ లోని జైసల్మేర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడారి, కోటలు, ఇసుక దిబ్బలు. వీటితో పాటు, ఎన్నో ఏళ్లుగా ఓ పాడుబడిన గ్రామం కూడా అక్కడ చాలా ఫేమస్.

అదే కుల్ధారా. ఒకప్పుడు సంపదతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. ముఖ్యంగా, వందల ఏళ్ల క్రితం ఒకే రాత్రిలో కుల్ధారాతో పాటు చుట్టుపక్కల 83 గ్రామాల ప్రజలు ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయారు. వారు ఎక్కడికి వెళ్లాలరనేది ఇప్పటికీ ఓ మిస్టరీ.

జైసల్మేర్‌కు సమీపంలో..

కుల్ధారా గ్రామం జైసల్మేర్‌కు పశ్చిమంగా సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఇళ్ల శిథిలాలు, ఇరుకైన వీధులు, పాత నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఒకప్పుడు ఇదే ప్రాంతం పాలివాల్ బ్రాహ్మణుల సందడితో నిండి ఉండేది. చరిత్ర ప్రకారం.. 1291 ప్రాంతంలో పాలివాల్ బ్రాహ్మణులు కుల్ధారాలో స్థిరపడ్డారు. ఎడారి ప్రాంతంలో కూడా వ్యవసాయం చేయడంలో ప్రత్యేక నైపుణ్యం చూపించారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో నీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుని పంటలు పండించడంతో క్రమంగా ఇక్కడి ప్రజలు ఆర్థికంగా బలపడ్డారు.

ఒక్క రాత్రిలో ఖాళీ అయిన గ్రామాలు

కుల్ధారా చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఘటన 1825లో జరిగినట్లు చెప్పబడుతుంది. ఓ రాత్రి కుల్ధారాతో పాటు చుట్టుపక్కల ఉన్న 83 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అంతమంది ప్రజలు ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ కచ్చితమైన సమాధానం లేదు. అయితే, కుల్ధారా గురించి ప్రాచుర్యంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ కథలో అప్పటి జైసల్మేర్ సంస్థానానికి చెందిన ప్రధానమంత్రి సలీం సింగ్ పేరు వినిపిస్తుంది. గ్రామ పెద్ద కుమార్తెపై అతడి కన్ను పడింది. ఆమెను వివాహం చేసుకోవాలని అతడు భావిస్తాడు. తన కోరికను తిరస్కరిస్తే గ్రామస్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సలీం సింగ్ హెచ్చరిస్తాడు. దీంతో ఆ దుర్మార్గుడి బారిన తమ అమ్మాయి పడకూడదనే కారణంతో కుల్దారా సహా పరిసర గ్రామాల ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లారని చెప్తారు.

వెళ్లేటప్పుడు కుర్దారాకు గ్రామస్తుల శాపం!

ఊరు వదిలి వెళ్లే ముందు గ్రామస్తులు కుల్ధారాకు శాపం పెట్టారని మరో కథ ప్రచారంలో ఉంది. తమ తర్వాత ఈ గ్రామంలో ఎవరూ నివసించకూడదని వారు శపించినట్లు చెప్తారు. ఈ శాపం కారణంగానే ఆ తర్వాత కుల్ధారా తిరిగి పూర్తిస్థాయిలో జనావాసంగా మారలేదని స్థానికులు నమ్ముతారు. ఈ కథకు చారిత్రక ఆధారాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, గ్రామాన్ని చుట్టుముట్టిన రహస్యం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.

పర్యాటకులను ఆకర్షిస్తున్న శిథిలాలు

ప్రస్తుతం కుల్ధారా రాజస్థాన్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా మారింది. పాత ఇళ్ల నిర్మాణం, ఇరుకైన వీధులు, శిథిలాల మధ్య కనిపించే పురాతన నిర్మాణ శైలి సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రాఫర్లు, సినిమా షూటింగ్ టీమ్స్ ఈ ప్రాంతాన్ని తరచుగా సందర్శిస్తుంటాయి. ప్రస్తుతం కుల్ధారా శిథిలాలు రాజస్థాన్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రక్షిత స్మారక ప్రాంతంగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రజలతో కళకళలాడిన ఈ గ్రామం ఇప్పుడు చరిత్ర, కథలు, రహస్యాలకు నిలయంగా మిగిలిపోయింది.

పై నుంచి చూస్తే దీన్ని అడవి అనుకుంటారు.. కానీ, అది అతి పెద్ద చెట్టు, ఎక్కడుందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live