అర్వింద్ అతి మాటల రోజులు పోయాయి. హద్దులు మీరి మాట్లాడితే మజా చేసే జనం ఇప్పుడు.. ఇప్పుడు అతడు మాట్లాడిన మాటలు ఉల్టా అతన్నే తాకుతున్నాయి. పార్టీ పటిష్టత కోసం మాట్లాడినట్టు కాకుండా..
పార్టీ లైన్ దాటి చాలా సందర్బాల్లో వ్యక్తిగతంగా మాటల దాడికి దిగాడు అర్వింద్. అది అలవాటుగా మారింది కూడా. తాజాగా రేవంత్‌ను టార్గెట్ చేయబోయి తనే సెల్ఫ్‌గోల్ అయ్యాడు. మధ్యలో తన తండ్రి, దివంగత నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్‌ను కూడా లాగాడు. ఇప్పుడు చర్చ సైడ్ ట్రాక్ పట్టింది.
అసలు డీఎస్ కాంగ్రెస్‌కు చేసిన సేవలేమిటయ్యా? అని ప్రశ్నించేదాకా వచ్చింది పరిస్థితి. డీఎస్‌కే కాంగ్రెస్ చాలా చేసింది.. అని క్లారిటీ ఇచ్చేస్తున్నాయి గాంధీభవన్ వర్గాలు. మరి దీన్నే అంటారు..తట్టి మరీ లేపి తన్నించుకోవడమంటే. రేవంత్‌కు కాకుండా..ఎవరికైనా సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు సీఎం పదవి ఇచ్చేదుండే అన్నాడు అర్వింద్. అందులో ఇద్దరి పేర్లు కూడా చెప్పాడు. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పేర్లకు ఎక్కడా ఆమోద ముద్ర పడలేదు. కనీసం మాటవరసకైనా.. కొందరు కాంగ్రెస్ నేతలన్నా.. అవును.. కరెక్టేనని కామెంట్ చేయలేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండే.. ఎక్కడికొచ్చింది? చివరకు అధికారంలోకి ఎలా వచ్చింది? వరుసగా జరిగిన రాజకీయ పరిణామాలన్నీ వారికి తెలుసు. పార్టీ సీనియర్లకూ తెలుసు. రేవంత్ లేకపోతే.. అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుండేదే కాదని.
బీఆరెస్‌ను వద్దనుకున్నారు కదా? వారిని దించాలనుకున్నారు కదా? అనే చర్చలు రావొచ్చు. కానీ అవతల కాంగ్రెస్ పార్టీలో సీఎంగా సర్కార్‌ను నడిపేదెవరు? అని కూడా జనం చూశారు. వారికి కనిపించిన ఆశాకిరణం రేవంత్. అందుకే ఓటేశారు. గెలిపించారు. కాకపోతే సీనియర్లకు సీల్డ్ కవర్ సీఎం ఆశలుంటాయి. కానీ ఈ ప్రస్తుత తరుణంలో ఆ సీన్ కనిపించడం లేదు. అందుకే సైలెంట్‌గా రెండో టర్ము అధికారంలోకి రావడానికి రేవంత్ వ్యూహాలకు అడ్డుతగలకపోవడమే.. తాము చేయాల్సిన పని అని గుర్తించారు. సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నారు. అర్వింద్ లేవనెత్తిన రెండు ఈ రెండు అంశాలూ బూమరాంగ్ అయ్యాయి. ఒకటి రేవంత్ కాకుండా.. ఇతర సీనియర్లకు ఇవ్వాల్సింది అని. దాన్ని ఎవరూ ఒప్పుకోలేదు. అంటే ఓ రకంగా పార్టీలో రేవంత్ అసమ్మతి లేదు అని చెప్పించినట్టయ్యింది.
ఇక తండ్రి ఎంతో చేశాడు కాంగ్రెస్‌కు అని ఏదో పాత చరిత్ర, తండ్రి ఆనవాళ్లు.. ఆ పార్టీ సానుభూతి చూపుతున్నట్టు నటించే క్రమంలో చేసిన కామెంట్.. డీఎస్‌కు పార్టీలో అంతో ఇంతో ఉన్న మర్యాద కూడా తీసేసినట్టయ్యింది. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు.. డీఎస్ కాంగ్రెస్‌కు ఏమీ చేయలేదని, కాంగ్రెస్సే అతనికి, అతని కుటుంబానికి ఎంతో చేసింది. ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యే సీన్ డీఎస్‌కు లేకుండె. ఒకవేళ తెలంగాణ అప్పటికే ఇచ్చి ఉంటే.. తప్పుకుండా సీఎం అయ్యేవాడేనని .. అంతలా కాంగ్రెస్ అతనికి తోడుందనే విషయాన్నీ చెబుతున్నారు. ఇక మూడో అంశం.. ఆరెసెస్ పలుకులు పలుకుతూ జాతీయ రాజకీయాలపై తనకు ఇంట్రస్టు ఉందని రేవంత్ అన్నాడని అర్వింద్ దానికి విపరీతార్థాలు తీశాడు.
అంటే బీజేపీలోకి వస్తాడేమో? మోడీకి, అతనికి ఏమైనా లింకులున్నాయేమో అని అన్నాడు. దీని ద్వారా తన పార్టీ పరువు తనే తీసుకున్నాడు. ఎందుకంటే.. రేవంత్ బీజేపీలోకి రావడం కల్ల. అది అందరికీ తెలుసు. తను ఎక్కడుంటే ఆ పార్టీకి వీరవిధేయుడిగా ఉంటాడు. ఆ విషయం రేవంతే స్వయంగా పలు వేదికల మీద చెప్పాడు కూడా. ఇక తెలంగాణ బీజేపీకి ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవదని, అధికారంలోకి రాదని, రేవంత్ లాంటి నేత వస్తే తప్ప తమకు బలం చేకూరదని, తమను తాము.. పలుచన చేసుకునే విధంగా.. అందులో మోడీని, పార్టీ లైన్‌ను పణంగా పెట్టేదాకా పోయాడు అర్వింద్. అయినా ఇవన్నీ అతనికేం అవసరం? రాష్ట్ర నేతలున్నారుగా పాలసీ మ్యాటర్‌పై మాట్లాడేందుకు? ఈ మధ్య తననెవరూ పట్టించుకోవడం లేదని.. ఇలాంటి కామెంట్స్ చేసి తనకు తాను సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు అర్వింద్.

