Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్లపై ఎండ.. భవనాలపై వర్షం.. చైనా కొత్త కూలింగ్ టెక్నిక్ కు ప్రపంచం ఫిదా!

రోడ్లపై ఎండ.. భవనాలపై వర్షం.. చైనా కొత్త కూలింగ్ టెక్నిక్ కు ప్రపంచం ఫిదా!

Big TV Live 2 days ago

China's Amazing Heat Solution: వేసవి వచ్చిందంటే చాలు.. ఎండల తీవ్రతతో బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన సమయంలో రోడ్లపై నడవడం, బస్‌స్టాప్‌ల దగ్గర నిలబడటం చాలా కష్టంగా మారుతుంది.

ఇలాంటి తీవ్రమైన వేడిని ఎదుర్కొనేందుకు చైనా కొన్ని ప్రాంతాల్లో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఎత్తైన భవనాల పైకప్పులపై ప్రత్యేకమైన రూఫ్‌ టాప్ మిస్టింగ్ సిస్టమ్‌ లను ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరుస్తోంది.

ఇంతకీ ఏంటీ రూఫ్‌ టాప్ మిస్టింగ్ సిస్టమ్‌!

చైనాలోని యున్‌చెంగ్, షాన్‌క్సీ ప్రాంతాల్లోని కొన్ని నివాస సముదాయాల్లో ఈ సరికొత్త విధానాన్ని ఉపయోగిస్తున్నారు. భవనాల పైకప్పులపై ప్రత్యేక పైపులు, నాజిల్స్‌ ను అమర్చి వాటి ద్వారా నీటిని చాలా చిన్న చిన్న బిందువులుగా బయటకు విడుదల చేస్తారు. చూస్తే పై నుంచి వర్షం పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది సాధారణ వర్షం కాదు. అధిక పీడనంతో విడుదలయ్యే నీటి బిందువులు గాలిలో కొంతసేపు ఉండి క్రమంగా ఆవిరవుతాయి. ఈ ప్రక్రియలో చుట్టుపక్కల గాలిలోని వేడిని నీటి ఆవిరి గ్రహిస్తుంది. దీంతో భవనం చుట్టూ ఉన్న వాతావరణం కొంత మేర చల్లబడుతుంది.

8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గింపు

ఈ మిస్టింగ్ సిస్టమ్‌ ద్వారా స్థానికంగా ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 8 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ప్రభావం వాతావరణంలోని తేమ, గాలి వేగం, నీటి సరఫరా వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపాల్సిన వారికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

రోడ్ల నుంచి బస్‌స్టాప్‌ల వరకు!

ఈ కృత్రిమ పొగమంచు వ్యవస్థను కేవలం భవనాలకే పరిమితం చేయకుండా, రోడ్లు, పార్కులు, కూడళ్లు, బస్‌స్టాప్‌ల లాంటి ప్రాంతాల్లో కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఎండలో నడిచే సమయంలో చుట్టూ చల్లటి నీటి బిందువులు ఉండటం వల్ల ప్రజలకు తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చే వృద్ధులు, పిల్లలు, ప్రయాణికులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న టెక్నిక్!

చైనాలో ఇలా భవనాలపై నీటి మిస్టింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైకప్పుల నుంచి నీటి బిందువులు పొగమంచులా కిందికి రావడంతో ఇవి చూసేందుకు కూడా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు యూరప్, అమెరికా, భారత్ సహా పలు దేశాల్లోనూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నగరాలను చల్లగా ఉంచేందుకు ఇలాంటి కొత్త ఆలోచనలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live