Sanjosh Foundation: 'బేవార్స్', 'సోదర' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సంజోష్, కేవలం వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ సామాజిక బాధ్యతతో ముందుకెళ్తున్నారు.
ఆయన స్థాపించిన 'సంజోష్ ఫౌండేషన్' (SANJOSH FOUNDATION) ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన, దిగువ మధ్యతరగతి విద్యార్థులకు ఘనంగా స్కాలర్‌షిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉంటూ.. పదో తరగతిలో 500కు పైగా మార్కులు, ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించిన 118 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారి ఉన్నత చదువుల ప్రోత్సాహార్థం ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నగదు స్కాలర్‌షిప్‌లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ వేడుకలో ఏఎస్పీ మనన్ భట్ IPS, డీఈఓ సిద్ధార్థ్ రెడ్డి, ఎంఈఓ మల్లిక్, పూజారి నాగేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొని.. సినీ రంగంలో ఉంటూ, గిరిజన ప్రాంతాల పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి నటుడు సంజోష్ చేస్తున్న ఈ వినూత్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు.
Read also-ఆసుపత్రి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్.. ఇక మాటల్లేవ్..
సంజోష్ ఫౌండేషన్ కేవలం విద్యకే పరిమితం కాకుండా, గతంలోనూ ఎన్నో సామాజిక సేవల ద్వారా ప్రజలకు అండగా నిలిచింది. గిరిజన ప్రాంతాల్లోని నిరుపేదల కోసం 168 ఉచిత మొబైల్ కంటి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు, పాఠశాల విద్యార్థులకు అవసరమైన టైలు, బెల్ట్లు, షూస్, ఎగ్జామ్ కిట్లను ఉచితంగా అందజేశారు. అంతేకాకుండా, ముగ్గురు నిరుపేద విద్యార్థుల పూర్తి చదువు బాధ్యతలను సంజోష్ వ్యక్తిగతంగా చూసుకుంటున్నారు. చిన్న వయసులోనే సమాజ సేవలో ముందుంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంజోష్‌పై ములుగు జిల్లా ప్రజల నుండి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.

