Election Results: ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఉత్కంఠకు తెరపడింది.. థ్రిల్లర్‌ని తలపించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సైలెన్స్ బ్రేక్ అయింది..
సస్పెన్స్ వీడింది. కింగ్ ఎవరో.. కింగ్ మేకర్లు ఎవరో తేలిపోయింది. బెంగాల్‌లో బీజేపీ డబుల్ సెంచరీ కొడితే.. తమిళనాడులో విజయ్ సెంచరీ కొట్టాడు. అస్సాంలోనూ బీజేపీ సెంచరీ మార్క్ క్రాస్ చేసింది. పుదుచ్చేరిని ఎన్డీయే నిలబెట్టుకుంది. కేరళంలోనూ యూడీఎఫ్ స్వీప్ చేసి పడేసింది. అసలు.. ఇంతటి గ్రాండ్ విక్టరీలు ఎలా సాధ్యమయ్యాయ్? మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఇలాంటి షాకులు ఎందుకు తగిలాయ్?
దీదీ కోటలో కమలం పాగా..
అంచనాలు తలకిందులైపోయాయ్.. లెక్కలు తారుమారయ్యాయ్.. కొన్ని చోట్ల అధికార పీఠాలు కదిలిపోగా.. ఇంకొన్ని చోట్ల సరికొత్త రాజకీయ శక్తులు ఉద్భవించాయ్. బెంగాల్ నుంచి కేరళ దాకా ఓటర్ పల్స్.. రాజకీయ పార్టీలకు స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. బెంగాల్‌లో వచ్చిన ఫలితాలైతే.. ఇండియా మొత్తాన్ని షేక్ చేశాయ్. కమలం వికసిస్తుందనే అంచనాలున్నా.. బీజేపీ ఏకంగా డబుల్ సెంచరీ కొడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. మొత్తంగా.. దీదీ కోటలో ఈసారి కమలం పాగా వేసింది. 200 మార్క్ దాటి.. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
బెంగాల్‌లో కమల వికాసం..
పదేళ్లుగా కొససాగుతున్న అధికార వ్యతిరేకత, కేంద్ర పథకాల ప్రచారం.. బీజేపీకి బలాన్నిచ్చాయ్. ముఖ్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ పట్ల ఉన్న అసహనం ఓట్ల రూపంలో బీజేపీకి మళ్లింది. వరుసగా నాలుగోసారి గెలిచేందుకు, కేంద్రం వర్సెస్ దీదీ అన్నట్లు ప్రొజెక్ట్ చేసేందుకు.. మమతా బెనర్జీ ఎంతో పోరాటం చేశారు. కానీ, అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఆమె విఫలమయ్యారు. ఫలితంగా.. బీజేపీ గట్టి దెబ్బ కొట్టేసింది. కచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పినట్లుగానే.. పవర్ షో చూపించారు. బెంగాల్ ఎన్నికలు ప్రధాని మోడీ, అమిత్ షా ప్రతిష్ఠకు సంబంధించినవి. ఇక్కడ ఓడితే.. నేషనల్ లెవెల్‌లో వారి ఇమేజ్ దెబ్బతినేది. అందుకే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. బెంగాల్‌లో కమల వికాసం కనిపించేలా చేశారు. పైగా.. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్.ఐ.ఆర్ కూడా టీఎంసీని కొంతవరకు దెబ్బకొట్టిందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి.. బెంగాల్ విషయంలో బీజేపీ కల నెరవేరింది.
విజయ్‌కు 'కులం లేదు' ట! స్వయంకృషితోనే…. సినిమా, రాజకీయం రెండింట్లోనూ!
డీఎంకే పై జనంలో వ్యతిరేకత
5 రాష్ట్రాల ఎన్నికల్లో బిగ్ సర్‌ప్రైజ్ ఏదైనా ఉందీ అంటే.. అది తమిళనాడే. సిల్వర్ స్క్రీన్‌పై రికార్డులు సృష్టించిన విజయ్.. రాజకీయాల్లోనూ ఎంట్రీతోనే తన మార్క్ చూపించారు. వందకు పైగా స్థానాలు గెలిచి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అందరనీ ఆశ్చర్యపరిచారు. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య నలిగిపోతున్న తమిళనాడు ఓటరుకు.. విజయ్ థర్డ్ ఆల్టర్నేటివ్‌గా కనిపించారు. యువత, మహిళా ఓటర్ల మద్దతు కూడా తోడవడంతో.. విజయ్ అందరికంటే ముందున్నారు. నిజానికి.. తమిళ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న వాక్యూమ్‌ని.. విజయ్ ఫిల్ చేశారు. డీఎంకే పాలనపై జనంలో వ్యతిరేకత ఉంది.. అన్నాడీఎంకే వెనుక బీజేపీ ఉండటాన్ని సహించలేకపోయారు. ఈ రెండు పార్టీలు వద్దనుకున్న తమిళ ఓటర్లకు.. ఆల్టర్నేట్‌గా విజయ్ టీవీకే పార్టీ కనిపించింది. అందుకే.. డీఎంకే, అన్నాడీఎంకని పక్కకు నెట్టి.. మెజారిటీ జనం టీవీకేకు ఓట్లు గుద్దిపడేశారు. అయితే డీఎంకే, కాకపోతే.. అన్నాడీఎంకే అనే సంప్రదాయానికి, ఆ రెండు పార్టీల ఆధిపత్యానికి తెరదించారు.
ఆ రెండు పార్టీల డామినేషన్‌కు చెక్..
వాస్తవానికి.. తమిళనాట విజయ్ చరిత్రని తిరగరాశాడు. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా.. జాతి గర్వం, సామాజిక న్యాయం, కుల వ్యతిరేక భావజాలాన్ని మేళవించే రాజకీయ తత్వంలో పాతుకుపోయిన ద్రవిడ రాజకీయాలకు.. తమిళనాడు దశాబ్దాలుగా కంచుకోటగా ఉంది. 1976లో.. డీఎంకే కాంగ్రెస్‌ని అధికారం నుంచి కూలదోసినప్పటి నుంచి.. ద్రవిడ భావజాలంపై ఆధారపడిన పార్టీలు మాత్రమే అధికారం చెలాయిస్తున్నాయ్. 1972లో ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే.. 1977లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి తమిళ్ పాలిటిక్స్‌లో.. డీఎంకే, ఏడీఎంకే ఆధిపత్యమే కొనసాగుతోంది. ఇది.. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలను.. తమిళనాడు రాజకీయాల్లో మూలకు నెట్టేసింది. ఆ రెండు పార్టీల డామినేషన్‌కు చెక్ పెట్టేందుకు ఎంతోమంది ప్రయత్నించారు. కానీ.. విజయ్ విజయం సాధించే దాకా ఇది వర్కవుట్ కాలేదు. మరోవైపు.. అన్నాడీఎంకే కూడా తన గ్రామీణ బేస్‌ని చాలా వరకు నిలుపుకొని, రెండో స్థానంలో నిలిచింది. అయితే, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో.. విజయ్ పార్టీ 118 మెజారిటీ మార్క్ దాటే అవకాశం లేకపోవడంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు.. టీవీకేకు మిత్రపక్షాల అవసరం ఉండే అవకాశముంది.
కేరళ ఓటర్లు మార్పు..
కేరళంలో పదేళ్ల యూడీఎఫ్ పాలనకు ముగింపు పలుకుతూ.. అక్కడి ప్రజలు తీర్పునిచ్చారు. పినరయి విజయ్ హ్యాట్రిక్ ఆశలకు గండికొడుతూ.. యూడీఎఫ్ క్లీన్ స్వీప్ చేసేసింది. వందకు పైగా స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసింది. స్థానిక సమస్యలు, పాలనలో వచ్చిన అవినీతి ఆరోపణలు ఎల్డీఎఫ్‌ని దెబ్బతీశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పక్కా ప్లానింగ్‌తో ఓటర్లను తమవైపు తిప్పుకుంది. కేరళ ఓటర్లు మార్పు కోరుకున్నారనే విషయం.. ఇండియా మొత్తం క్లియర్‌గా అర్థమైంది. కేరళ రాజకీయాల్లో ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయాన్ని.. గతేడాది ఎల్డీఎఫ్ బ్రేక్ చేసింది. పదేళ్ల తర్వాత ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత.. విజయన్ సర్కారును దెబ్బకొట్టింది. ఈ ఎన్నికల్లో.. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 71 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ని యూడీఎఫ్ ఈజీగా దాటేసింది. పదేళ్ల ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత యూడీఎఫ్‌కు గట్టిగా కలిసొచ్చింది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, విదేశాలకు యువత వలస వెళ్లడం వంటి అంశాలపై యూడీఎఫ్ చేసిన పోరాటం ఓటర్లను ఆకర్షించింది. ఇక, కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీలు సమన్వయంతో పనిచేయడం ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది.
చెన్నైలో సంచలనం.. మాజీ మంత్రిని మట్టికరిపించిన ఆటో డ్రైవర్..!
ప్రతిపక్షాల మధ్య సమన్వయ లోపం
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో.. బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. తనకున్న పట్టుని మరింత బిగించింది. సెంచరీ మార్క్ దాటి ఘన విజయం సాధించింది. అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన అస్సాం ఓటర్లను ఆకట్టుకుంది. ప్రతిపక్షాల మధ్య సమన్వయ లోపం బీజేపీకి కలిసొచ్చింది. ఈ విజయంలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక పాత్ర పోషించారు. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రిగా, ముఖ్యమంత్రిగా హిమంత ప్రజలకు దగ్గరయ్యారు. వారికి ఇల్లు, విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆదివాసీ ప్రాంతాల్లో శాంతిభద్రతల కల్పనపై ఫోకస్ పెట్టారు. దాంతో.. ప్రజలు ఆయన్ని తమ బాగోగులు చూసుకునే మామగా ఆదరించారు.
పుదుచ్చేరిలోనూ..
కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వమే ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు తెప్పించడం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం వెచ్చించడం చేశారు. పైగా ప్రత్యర్థి కాంగ్రెస్‌ని బలహీనపరిచేందుకు దొరికి ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. దాంతో.. కాంగ్రెస్ అస్సాంలో పుంజుకోలేకపోయింది. కాంగ్రెస్ మినహా ఎన్నికల్లో బీజేపీకి ఇతర పార్టీలేవీ గట్టి పోటీ ఇవ్వకపోవడంతో.. వార్ వన్ సైడ్ అయింది. బీజేపీకి హ్యాట్రిక్ విక్టరీని కట్టబెట్టింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ.. ఎన్డీయే కూటమి తన అధికారాన్ని కాపాడుకుంది. స్థిరమైన పాలన కావాలని కోరుకున్న ప్రజలు మళ్లీ కూటమికే జై కొట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 16ని ఎన్డీయే క్రాస్ చేసేసింది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలేవీ పెద్దగా పుంజుకోకపోవడంతో.. అంతా డబుల్ ఇంజిన్ సర్కారుకే జై కొట్టారు.
బీజేపీ సోషల్ మీడియాలో..
ముఖ్యంగా.. బెంగాల్, తమిళనాడు, కేరళలో.. అధికార పార్టీలు ఓటమిపాలవడానికి కొన్ని కీలక కారణాలున్నాయ్. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల.. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఉద్యోగ అవకాశాలు, కొత్త తరహా రాజకీయాల కోసం యువత ఆరాటపడటం లాంటివి దెబ్బకొట్టాయ్. బలమైన ప్రతిపక్షం లేని చోట కొత్త పార్టీలు షాకిచ్చాయ్. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత.. దేశంలో ఎన్డీయే బలం పెరిగింది. బీజేపీ బెంగాల్ దాకా చేరిందని, ఇక భారత్ అంతా మోదీమయం అని బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు అధికారం కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య.. ఇప్పుడు 22కి పెరిగింది. మొత్తానికి.. 2026 అసెంబ్లీ ఎన్నికలు.. భారత రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయ్. ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడని, సరైన సమయంలో.. సరైన తీర్పు ఇస్తాడని.. ఈ రిజల్ట్స్ మరోసారి నిరూపించాయ్.
Storey By: Appa Rao Big Tv

