Esha Singh: ISSF ప్రపంచ కప్-2026 షూటింగ్ పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన మన హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్‌పై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు.
జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ మ్యాచ్‌లో ఇషా ఏకంగా 43 హిట్స్ సాధించి, ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కొనియాడారు.
మన నగరానికి చెందిన ఇషా సింగ్ చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించడం వెనుక ఆమె అంకితభావం, కఠినమైన క్రమశిక్షణ, పట్టుదల ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆమె ఒక నిజమైన స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు. ఇషా ప్రదర్శించిన ఈ అసాధారణ ప్రతిభ దేశంలోని ఎందరో క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ వేదికపై మన తెలంగాణ గడ్డ కీర్తిని, దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఇషా సింగ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆమె మరెన్నో అద్భుత విజయాలు సాధించి, దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

