CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్న విజయ్.. తాజాగా తన దుస్తులపై వస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానమిచ్చారు.
రాజకీయ నాయకుడంటే ఇలాగే ఉండాలనే పాత చింతకాయ పచ్చడి రూల్స్‌ను పక్కనపెట్టి, తనదైన స్టైల్‌తో ప్రజల్లోకి వెళ్తున్నారు.
కోట్ వేసుకుంటే తప్పేంటి?
ఇటీవల ఆయన వేసుకుంటున్న సూట్, కోట్‌లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై విజయ్ స్పందించారు. 'ముఖ్యమంత్రి అయితే కోట్ సూట్ వేసుకోకూడదా? నా సూట్‌ను కూడా విమర్శిస్తున్నారు. మన హృదయాల లాగే నేను కూడా బ్లాక్ అండ్ వైట్ రంగులనే ధరిస్తున్నాను. విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్‌గా (అంటే చాలా నిజాయితీగా, ఓపెన్‌గా) ఉంటాడనే దానికి ఇదే నిదర్శనం' అంటూ విమర్శకుల నోళ్లు నొక్కేశారు.
సీఎం కాదు.. ప్రజల సేవకుడిని
తాను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత మాత్రాన పాలకుడిలా ప్రవర్తించనని, ఎప్పటికీ ప్రజలకు సేవకుడిగానే ఉంటానని విజయ్ స్పష్టం చేశారు. ఇన్నేళ్లుగా తమిళనాడును మభ్యపెడుతూ, మోసం చేస్తూ వచ్చిన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) పార్టీలకు గత ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు.
పోటీ ఇకపై ఆ రెండు పార్టీల మధ్యే!
భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తమ వైపే ఉంటారనే నమ్మకాన్ని విజయ్ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అసలైన పోటీ కేవలం డీఎంకే (DMK), తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీల మధ్యే ఉంటుందని, మూడో పార్టీకి ఇక్కడ స్థానం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. విజయ్ మాటలు చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ పాలిటిక్స్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ 'సంకల్ప సభ'కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

